రంగారెడ్డి, మే 12 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం.. అనేక విశిష్టతలు కలిగిన ప్రాంతం. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల మేళవింపు కలిగిన ఈ నియోజకవర్గంలో స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తూ వస్తున్నది. ఇక్కడి ఓటర్లు 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్తో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలు తలపడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ నుంచి గడ్డం రంజిత్‌రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు పోటీ పడుతున్నారు.
హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నం చేస్తుండగా.. కాంగ్రెస్, బీజేపీలు పట్టుకోసం పరితపిస్తున్నాయి. ఎవరికి వారుగా అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన సీట్లు, వచ్చిన ఓట్లే విజయానికి బాట వేస్తాయని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. బీఆర్ఎస్కు చేవెళ్ల లోక్‌సభ పరిధిలో 7.07లక్షల ఓట్లు రావడం.. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 97వేల పైచిలుకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. బలాబలాల దృష్ట్యా తాజా ఎన్నికల్లో విజయంపై బీఆర్ఎస్ పార్టీ ధీమా పెట్టుకున్నది.
తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉన్నది. 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తుండడంతో చేవెళ్ల గడ్డ బీఆర్ఎస్ అడ్డాగా మారింది. అసెంబ్లీ ఫలితాల్లో ఇతర ప్రాంతాలకు భిన్నంగా ప్రజలు తీర్పునిచ్చి లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పక్షానే నిలిచారు.
ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీల్లో బీఆర్ఎస్కు 7,07,456 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 6,09,522 ఓట్లు, బీజేపీకి 3,35,504 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకి 97వేల పైచిలుకు ఓట్లు అధికంగా వచ్చాయి. దీంతో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రజల నుంచి ఇదే ఆదరణ లభించనున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
చేవెళ్ల లోక్‌సభలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే త్రిముఖ పోటీ ఉన్నది. మొదటి నుంచీ ఇక్కడి ఓటర్లు విచక్షణతో తీర్పునిస్తూ వస్తున్నారు. 2014లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. గెలిచాక పార్టీ ఫిరాయించారు. 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయగా బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కొండా ఓటమి పాలయ్యారు. 2019లో గడ్డం రంజిత్‌రెడ్డిని బీఆర్ఎస్ పోటీలో నిలబెట్టగా.. చేవెళ్ల నియోజకవర్గ ప్రజానీకం ఆయన్ని గెలిపించి గులాబీ జెండాను రెపరెపలాడించింది.
రంజిత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ను వీడి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎన్నికల్లోనూ ఫిరాయింపుదారులకు గుణపాఠం తప్పదా! అన్న టాక్ వినిపిస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం.. మిగతా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు జనరల్ కేటగిరీకి చెందినవారు కావడం కూడా బీఆర్ఎస్కు కలిసొచ్చే అంశమని వివిధ వర్గాలు పేర్కొంటున్నాయి.