నవాబుపేట, ఆగస్టు 21 : రేపు చేవెళ్ల నియోజకవర్గకేంద్రంలో నిర్వహించే రైతు ధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నవాబుపేట మండల నేతలు కార్యకర్తలను ఏకంచేస్తూ ఒక రోజు ముందే సన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీ అసంపూర్తిగా ఉన్నదని, దానిని సంపూర్ణంగా చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు చేవెళ్లలో నిర్వహించనున్న ధర్నాకు తామంతా సిద్ధమవుతున్నట్లు నేతలు అన్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి సూచనలను తీసుకునేందుకు బుధవారం వారు ఆమె నివాసంలో కలిశారు.
వదిలే ప్రసక్తి లేదు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కొడంగల్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేవరకు వదిలే ప్రసక్తి లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గురువారం నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో చేపట్టే రైతు రుణమాఫీ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాల్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్దఎత్తున రైతులు పాల్గొని ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని నిలదీద్దామని పిలుపునిచ్చారు. ఉదయం 9.30 గంటలకు నిరసన కార్యక్రమం ప్రారంభమవుతుందని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని ఆయన కోరారు.
షరతులు లేకుండా మాఫీ చేయాలి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
పరిగి : ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వం రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం 9.30 గంటలకు పరిగిలోని బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాడుతాం మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి
తాండూరు : గురువారం తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం ఇందిరాచౌక్ వద్ద ‘రైతన్నకు బాసటగా ధర్నా’ కార్యక్రమం చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ తాండూరు అసెంబ్లీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి బుధవారం నమస్తే తెలంగాణతో పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతోపాటు రైతులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు ప్రజల తరఫున నిలబడి పోరాడుతామన్నారు.