వికారాబాద్, అక్టోబర్ 8 : కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు మాయమయ్యాయని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మహిళా నేతలతో సమావేశం నిర్వహించారు. వారితో అనేక రాజకీయ విషయాలు చర్చించిన అనంతరం ఆయన మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు.
కేసీఆర్ హయాంలో అమ్మ ఒడి పథకం ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గర్భవతులు/బాలింతల సంరక్షణ కోసం ప్రభుత్వ వాహనాలు పెట్టి ఇంటి నుంచి ఆసుపత్రికి తీసుకువచ్చి, అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా చేసి, తిరిగి వారిని ఇంటి దగ్గర దింపేదన్నారు. కానీ ఇప్పుడు సొంత డబ్బులతో ప్రైవేట్ వాహనాల్లో రావలసిన భారం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గర్భవతులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, తల్లీబిడ్డల సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ అందించి వారి ఆరోగ్యంపై దృష్టి సారించారని వివరించారు. తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు ఇచ్చే చీరలు సైతం కాంగ్రెస్ పాలనలో ఆగిపోయాయన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు మహిళలు బిందెలతో రోడ్డు మీదకు రావలసిన పరిస్థితిని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు అదుపు తప్పి మహిళలపై హత్యలు, మానభంగాలు వంటి నేరాలు విపరీతంగా పెరిగాయన్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని గొప్పలకుపోయిన రేవంత్‌రెడ్డి.. మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ.2,500., అంగన్వాడీ, ఆశావర్కర్లకు వేతనాలు పెంచుతామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ తీసుకువచ్చిన బాకీ కార్డులను గ్రామాల్లో ఇంటింటా పంపిణీ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు అశోక్, మండల జనరల్ సెక్రటరీ శివకుమార్, మండల మైనార్టీ, ఎస్సీ, బీసీ, ఎస్టీ విభాగాల అధ్యక్షులు గయాజ్, శ్రీనివాస్, మల్లేశ్‌యాదవ్, మహిపాల్‌నాయక్, మండల యువజన విభాగం అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు.