షాద్నగర్, డిసెంబర్ 3 : గురుకుల పాఠశాలల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్వీ బృందం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం షాద్నగర్ మున్సిపాలిటీ చటాన్పల్లిలోని గురుకుల పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లిన వారిని అక్కడి సిబ్బంది అడ్డుకోగా, పాఠశాల ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖకు మంత్రి లేడని, విద్యార్థుల సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు. చాటాన్పల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో కొంత మంది విద్యార్థులను ఎలుకలు కరువగా, అనారోగ్యానికి గురై ఓ విద్యార్థి మృతి చెందాడని తెలిపారు.
విద్యార్థులకు వడ్డించే భోజనంలో ప్లాస్టిక్ కవర్లు, రాళ్లు వస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాగునీటి కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. గురుకులంలో సరిపడా మరుగు దొడ్లు లేవని, ఉన్న మరుగుదొడ్లకు, స్నానపు గదులకు తలుపులు లేవన్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వస్తే పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది ప్రధాన ద్వారానికి తాళం వేసి, ఏమీ చెప్పవద్దంటూ విద్యార్థులను బెదిరించడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కలుషిత ఆహారం తిని, ఇతర వేధింపులతో సుమారు 50 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆరోగ్య వివరాలను చెప్పేందుకు పాఠశాల సిబ్బంది వెనుకాడుతున్నారని అన్నారు. గత 11 నెలలుగా భవనానికి అద్దె ఇవ్వడం లేదని, మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. గురుకుల పాఠశాల ముందు నిరసన తెలిపిన టీఆర్ఎస్వీ నాయకులను షాద్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ ఉస్మానియా విశ్వవిద్యాలయ నాయకుడు చిటారి దశరథ్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు శీలం శ్రీకాంత్, గుండు అశోక్, శరత్కృష్ణ, రాజశేఖర్, హనుమంతు, శ్రీనివాస్, సత్యం, శేఖర్, సంజూనాయక్, ప్రవీణ్, నవీన్, దారమోని సాయియాదవ్, సాయితేజ, శివనాయక్, జగన్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Rr