KTR | మణికొండ, ఆగస్టు 17 : హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన కేటీఆర్.. నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అమూల్యమైన సలహాగా బస్సుల్లో సీట్లు పెంపు చేయమన్నారని, పొరపాటున మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై అన్న చిన్నపాటి మాటకు మహిళా కమిషన్ స్పందించి నోటీసులు ఇవ్వడం హేయమైన చర్య అని మణికొండ బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మానవతావాదిగా మహిళలకు క్షమాపణలు చెప్పినా.. రాజకీయ రంగులు పూసి.. కాంగ్రెస్ నేతలు అబద్ధాలతో పూటగడుపుకొంటున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చినా తప్పే అయిపోతున్నదన్నారు. కాగా, మణికొండ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మర్రిచెట్టు వద్ద కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి, విజయలక్ష్మి, లతాగౌడ్, అందె లక్ష్మణ్‌రావు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.