ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల దిష్టిబొమ్మలను దహనం చేయడంతో పాటు ర్యాలీలు, ధర్నాలు చేశారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయాలని పలుచోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.
కొడంగల్, మార్చి 12 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. బండిని వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్ మాట్లాడుతూ.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయ డం చాలా బాధాకరమని.. ఒక్క కవితనే కాదు.. యావత్ భారతదేశంలోని మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్లుగా ఉన్నదన్నారు. దేశంలో మహిళలకు ఎంతో గౌరవం ఉందని, అటువంటిది ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బండి సంజయ్‌ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
పూడూరు : ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావని పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజారుద్దీన్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓ మహిళ అని చూడకుండా బండి సంజయ్ మాట్లాడటం ఆయన హోదాకు తగదన్నారు. సంజయ్‌ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో బీఆర్ఎస్ మండల మైనార్టీ నాయకుడు రహిస్ఖాన్ ఉన్నారు.
బొంరాస్‌పేట : కవితపై బండి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆదివారం బొంరాస్‌పేట, దుద్యాల మండల కేంద్రాల్లో ఆందోళన నిర్వహించారు. రెండు మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో బండి దిష్టి బొమ్మలను నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. బీజేపీ, బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మహిళలంటే బీజేపీకి, బండికి ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు నారాయణరెడ్డి, ఎల్లప్ప, బీఆర్ఎస్ నాయకులు దేశ్యానాయక్, నారాయణరెడ్డి, ఖాజా మైనుద్దీన్, నరేశ్‌గౌడ్, మహేందర్, యూనుస్, బసిరెడ్డి, కవిత, వెంకటయ్య, జావీద్, రాజు, కేశవులు, మొగులయ్య, అశోక్ పాల్గొన్నారు.
మర్పల్లి : కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మర్పల్లి ఎంపీటీసీ సంగీత డిమాండ్ చేశారు. హద్దుమీరి మాట్లాడే ముందు బండి సంజయ్ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారన్న విషయం మర్చిపోవద్దన్నారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తెలంగాణ ఆడపడుచులు ఊరుకునేది లేదని హెచ్చరించారు.
బషీరాబాద్ : కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండిని వెంటనే అరెస్ట్ చేయాలని బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రామునాయక్ మాట్లాడుతూ.. మహిళ అనే ఇంగిత జ్ఞానం లేని సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మహిళలపై ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణలో తిరుగనివ్వబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ శివనాయక్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు నరేశ్ చౌహాన్, నాయకులు ప్రేమ్, శ్రవణ్, రాము, కుమార్ ఉన్నారు.
కొత్తూరు : కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య డిమాండ్ చేశారు. కొత్తూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం బండి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. బాధ్యత గల పదవిలో ఉన్న బండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. మహిళలపై గౌరవం లేని బండిని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు మొదటి నుంచి మహిళలపై గౌరవం లేదన్నారు. మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ మళ్లీ సమర్థించుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా బండిపై బీఆర్ఎస్ కొత్తూరు మండల నాయకులు కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్‌యాదవ్, సత్యనారాయణ, యాదగిరి, ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్ రాజు, మల్లాపూర్ సర్పంచ్ సాయిలు, ఇన్ముల్‌నర్వ ఉప సర్పంచ్ శ్రీరాములు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పద్మారావు, నాయకులు శ్రీశైలం, గోపాల్‌నాయక్, జనార్దనచారి, రాములుగౌడ్, వెంకటేశ్, యాదయ్య, ఆంజనేయులుగౌడ్, శ్రీనివాస్‌చారి, వినయ్, లక్ష్మయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు.
నందిగామ, మార్చి 12 : కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, సర్పంచ్ గోవిందు అశోక్, రమేశ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కట్న శ్రీశైలం, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహ, రాజు, సురేశ్, రాంబాబు, ఈశ్వర్, శ్రీశైలం, శ్రీపాల్‌రెడ్డి, శేఖర్, విజయ్, రమేశ్, గోపాల్ పాల్గొన్నారు.
షాద్‌నగర్ : మహిళలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించబోమని షాద్‌నగర్ మహిళా బీఆర్ఎస్ నాయకులు అన్నారు. షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో బండిపై ఫిర్యాదు చేశారు. సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ షాద్‌నగర్ ముఖ్యకూడలిలో బండి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కవితపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని.. మాటలను వెనక్కి తీసుకోవాలన్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయ లభ్ధి పొందాలని చూడటం ఆ నాయకుల అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు మహేశ్వరి, కౌసల్య, ప్రేమలత, సరితాయాదవ్, వెంకట్రాంరెడ్డి, అనంతయ్య, పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, యువజన అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, నాయకులు సుష్మారెడ్డి, రాజశేఖర్, రవి, యాదగిరియాదవ్, రవీందర్‌రెడ్డి, కిట్టు, బాలునాయక్ పాల్గొన్నారు.