రంగారెడ్డి, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) ; సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంపై ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం కాంగ్రెస్ సర్కారు చర్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వినూత్న రీతిలో నిరసనలు తెలిపాయి. తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించి కాంగ్రెస్ వైఖరిని దుయ్యబట్టారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు కట్ట వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కొత్తూరు వై జంక్షన్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పరిగిలో మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి క్షీరాభిషేకాలు నిర్వహించారు. నిరసన కార్యక్రమాల్లో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సిగ్గుమాలిన చర్య..
రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలంగాణ అస్థిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్య అంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధంలేని వ్యక్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని పేర్కొంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీకి బానిసలుగా మారుస్తారని తాము ముందునుంచి చెప్పినట్లుగానే జరుగుతున్నదని విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాల కన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఢిల్లీ బాసుల మెప్పు పొందడమే ముఖ్యమైపోయిందని ఎద్దేవా చేస్తున్నారు. చేసిన తప్పును రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని, తెలంగాణ అస్థిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధే అని కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ప్రజావ్యతిరేకమే..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని తెలంగాణవాదులెవ్వరూ హర్షించరని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం చందన చెరువు కట్టపై ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె క్షీరాభిషేకం చేయడంతో పాటు క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణ తల్లిని అవమానించిన కాంగ్రెస్‌కు సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ చర్యలు
కొత్తూరు : కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు తెలంగాణ తల్లిని అవమానించేలా ఉన్నాయిని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం ప్రతిష్ఠించినందుకు నిరసనగా బీఆర్ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు కొత్తూరు వై జంక్షన్ వద్ద తెలంగాణ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టానికి రాజీవ్ గాంధీతో ఏం సంబంధం ఉన్నదని ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సంస్కృతిని దెబ్బతీసేలా కాంగ్రెస్ చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్‌యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్, కౌన్సిలర్లు, కొస్గి శ్రీనివాసులు, మాదారం నర్సింహాగౌడ్, నాయకులు గోపాల్‌గౌడ్, బ్యాగరి యాదయ్య, పెంటనోళ్ల యాదగిరి, జంగగళ్ల శివకుమార్, దేశాల జైపాల్, వీరమోని వెంకటేశ్, వీరమోని శ్రీను తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టేలా..
పరిగి : తెలంగాణ సచివాలయం, అమరజ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన స్థలంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం సరికాదని, తెలంగాణ ఆత్మాభినాన్ని తాకట్టు పెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుకు నిరసనగా మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పరిగిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ చర్యను తెలంగాణవాదులు క్షమించరన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ ఎంపీపీ కరణం అరవిందరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏ సురేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకుడు బీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు వారాల రవీంద్ర, బొంబాయి నాగేశ్వర్, ఎదిరె కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు ముకుంద శేఖర్, బీ రవికుమార్, మౌలానా, ఆకారపు రాజు, జీ అశోక్, తాహెర్‌అలీ, శ్రీశైలం, శ్రీనివాస్, ఆసిఫ్, మహిళా విభాగం నాయకురాలు అనూష, మంజుల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.