ఇబ్రహీంపట్నం, మే 15 : ఐపీఎల్ అంటేనే యువతలో మంచి క్రేజ్ ఉన్నది. ఈ రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ క్రికెట్‌ను ఆసక్తి వీక్షిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు బెట్టింగ్ నిర్వాహకులు అమాయకులతో బెట్టింగ్‌లు పెట్టించి నిండా ముంచుతున్నారు.
రెండు జట్ల మధ్య జరిగే ఆట కాస్త జూదంలా మారిపోయింది.
ముఖ్యంగా యువత బెట్టింగ్ మోజులో జేబులు గుల్లా చేసుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులను సంపాదించుకోవచ్చనే దురాలోచనలతో యవకులు విలువైన వస్తువులను తాకట్లు పెట్టి మరీ సర్వం కోల్పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఐపీఎల్ బెట్టింగ్‌లు చాపకింద నీరులా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు పాకిపోయింది. మ్యాచ్‌ను తిలకిస్తూ, బెట్టింగ్‌లను కాస్తూ మద్యాన్ని సేవించడం ఒక వ్యసనంలా మారుతున్నది.
ఐపీఎల్ ప్రారంభ దశలో సామాజిక మాధ్యమాలు పెద్దగా అందుబాటులో లేకపోవడంతో యువత బెట్టింగ్‌ల జోలికి వెళ్లేదికాదు. ఐదేండ్లుగా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉండడం.. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలు విస్తృతంగా వినియోగంలోకి రావడంతో బెట్టింగ్‌ల జోరుగా సాగుతున్నది. పదిమంది యువతకు కలిపి ఒక వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని యథేచ్చగా ఎవరికీ అనుమానాలు కలుగకుండా బెట్టింగ్‌లను కాస్తూ అప్పులపాలవుతున్నారు.
నూతన అంశాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ గూగుల్‌ను వినియోగింస్తుంటారు. ఐపీఎల్ బెట్టింగ్‌ను ఎలా వేయాలి.. ఎలాంటి యాప్‌లు అందుబాటులో ఉన్నాయి ఇలా ప్రతి ఒక్కటి గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ బెట్టింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. గతంలో ఆట పూర్తి కాగానే అందరూ ఒకే దగ్గరకు చేరుకుని గెలిచిన వాడు ఓడినవాళ్ల దగ్గర డబ్బులను వసూళ్లు చేసుకునేవారు. ప్రస్తుతం ప్రతి ఒక్కటి ఆన్లైన్లో అందుబాటులోకి రావడంతో డబ్బులను పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే తదితర యాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి.
బెట్టింగ్ నిర్వాహకులు ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తున్నారు. పదిమంది యువకుల్లో ఒకరి చొప్పున నిర్వాహకులు మచ్చిక చేసుకొని పెద్ద ఎత్తున యువతను బెట్టింగ్ దందాలోకి లాగేలా చూస్తున్నారు. సదరు వ్యక్తికి మ్యాచ్ ఓడినా, గెలిచినా ఐదుశాతం చొప్పున కమీషన్ ఇస్తూ అమాయకులను బెట్టింగ్‌లోకి రప్పించేలా ఆ వ్యక్తిని మధ్యవర్తిగా వినియోగించుకుంటున్నారు. ప్రధాన చౌరస్తాలను ఎటువంటి సంచారం లేని వీధులను ఎంపిక చేసుకుని ఈ వ్యవహరాన్ని కొనసాగిస్తున్నారు.
ఐపీఎల్ బెట్టింగ్ యువత పాలిట జూదంలా మారింది. బెట్టింగ్ కాసే దగ్గర వ్యక్తులు లేనప్పటికీ ఆన్లైన్లో డబ్బులు పంపిస్తే చాలు, ప్రధాన టీంలకు ఒక రేటు, మామూలు టీంలకు ఒక్క రేటును నిర్వాహకులు ఫిక్స్ చేస్తారు. ప్రధాన టీంలో ప్రతి ఓవరుకు లేదా ప్రతి బ్యాట్‌మెన్ సాధించే పరుగుల మీద, ప్రతి బౌలర్ తీసే వికెట్లపై ఒక్కో రేటును ఫిక్స్డ్ చేయడంతో యువత బెట్టింగ్‌ల వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. మొదటి రెండు రోజులు సరదాగా అలవాటైన బెట్టింగ్‌లు జూదంలా మారి ప్రతి ఏడాది ఎక్కడ ఉన్నా ఫోన్లలో బెట్టింగ్ వేస్తున్నారు. బెట్టింగ్ కాసే సమయంలో డబ్బులు లేకుంటే ఖాళీ ప్రామిసరీనోట్ మీద సంతకం లేదా బైకులు, మొబైల్స్‌ను పెట్టుకుని రూ.10 మిత్తితో నిర్వాహకులే డబ్బులను ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ఐపీఎల్ బెట్టింగ్‌లను పూర్తిగా అరికట్టాలంటే విద్యార్థులు, యువకులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టిని సారించాలని పోలీసులు సూచిస్తున్నారు. క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడే వారే దానిపై ఉన్న మోజుతో ఊబిలోకి కూరుకుపోతున్నారని హెచ్చరిస్తున్నారు. మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో పిల్లలు టెన్షన్‌గా ఉండటం, సెల్‌ఫోన్, ల్యాప్‌టప్, కంప్యూటర్ల వినియోగం అధికంగా ఉన్నట్లయితే వారిని ఆరాతీయాలి. అదే విధంగా మనీ ట్రాన్స్ఫర్లపై దృష్టి పెట్టాలి, దీని వల్ల బెట్టింగ్ ఊబి నుంచి బయట పడటానికి అధిక అవకాశాలుంటాయని, గ్రామీణ ప్రాంతాల్లోని, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు యువకుల తల్లిదండ్రులు బెట్టింగ్ విషయంలో తమ పిల్లలు కూరుకుపోకుండా జాగ్రత్తలు వహించాలని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు.
ఐపీఎల్ క్రికెట్ కొనసాగుతున్నందున ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ వేదికగా పెద్ద ఎత్తున బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. ఎక్కడైనా బెట్టింగ్‌లకు పాల్పడినట్లు మా దృష్టికి వస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. ముఖ్యంగా యువత ఈ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి.
– కేవీపీ రాజు, ఏసీపీ ఇబ్రహీంపట్నం