మొయినాబాద్, ఫిబ్రవరి15: గౌడ కల్లు గీత కార్మికుల హక్కుల సాధన కోసం, వాళ్ల ఆత్మగౌరవ బావుట ఎగురవేయడానికి ఎన్నో పోరాటాలు చేసిన విప్లవయోధుడు బొమ్మగాని ధర్మభిక్షం ఆశయసాధన కోసం పని చేయాల్సిన అవసరం ఉందని గీత పని వార్ల సంఘం రాష్ట్ర నాయకులు కాసుల సురేందర్ గౌడ్, టీడీపీ చేవెళ్ల పార్లమెంటు ఇంచార్జి కాసుల సుభాన్ గౌడ్ తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, గీత పని వార్ల సంఘం వ్యవస్థాపకులు ధర్మభిక్షం 103వ జయంతి వేడుకలను శనివారం నాడు సీపీఐ మండల కార్యదర్శి కె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మభిక్షం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గౌడ కులస్తులు ఐక్యంగా ఉండటం కోసం వారి హక్కులను వాళ్లు సాధించుకోవడం కోసం గీత పని వార్ల సంఘం ఏర్పాటు చేసి గౌడ కులస్తుల్లో ఐక్యతను పెంచారని తెలిపారు. ధర్మభిక్షం అనేక పోరాటాలు చేసి గౌడ హక్కుల సాధనకు కృషి చేశారని, వారి ఆశయ సాధన కోసం తప్పకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.