70 ఏండ్లలో జరుగని అభివృద్ధి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగింది
అభివృద్ధి, సంక్షేమాలపై ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలి
అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ కృషి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
వికారాబాద్ జడ్పీ భవన నిర్మాణానికి భూమిపూజ
పరిగి, ఫిబ్రవరి 28 :ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి తీరుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌లో రూ.5.15కోట్లతో నిర్మించతలపెట్టిన జిల్లా పరిషత్ భవన నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు. 70 ఏండ్లలో జరుగని అభివృద్ధిని అతి తక్కువ కాలంలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పబ్బం గడుపుకోవడానికి ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. వికారాబాద్ జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇంత అభివృద్ధి జరుగుతుంటే కండ్లుండి కూడా చూడలేని కబోదుల్లా ప్రతిపక్ష నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారన్నారు.
‘పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం.. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి.. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగింది..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం వికారాబాద్‌లో రూ.5.15 కోట్లతో జిల్లా పరిషత్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి మంత్రి సబితారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ వికారాబాద్‌లో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమ ఫలాల వివరాలను ఫ్లెక్సీల్లో పొందుపర్చి గ్రామాల్లో ఏర్పాటు చేయాలన్నారు. గత పాలకుల హయాంలో వేసవికాలంలో తాగునీటి గోస ఉండేదని, కరెంటు కష్టాలతో ఫ్యాక్టరీలు మూతపడిన సంఘటనలు ఉన్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు రూ.40వేల కోట్లతో మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారన్నారు. వికారాబాద్ జిల్లాలో రూ.1300 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టడం జరిగిందని, ప్రతి గ్రామానికి కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. పక్కనున్న కర్ణాటకకు తాను వెళ్లానని, అక్కడ పింఛన్ రూ.500 అందుతుందన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ పింఛన్ అందజేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. ప్రతినెలా గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు అభివృద్ది, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. రూ.8వేల కోట్లు వెచ్చించి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. మంత్రి సబితారెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నానని, ప్రైవేటు స్కూళ్లను మించి సర్కారు బడులను తయారవుతున్నాయన్నారు. వైద్యరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు.
రాష్ట్రంలో అమలు చేసిన అనేక పథకాలను బీజేపీ, కాంగ్రెస్‌లు కాపీ కొడుతున్నాయన్నారు. ఇన్నేండ్లుగా పాలించిన వారు రైతుబంధు, కల్యాణలక్ష్మి, పింఛన్లు ఎందుకివ్వలేదని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శించడం సిగ్గుచేటన్నారు. పీఎంజీఎస్‌వై కింద జిల్లాకు రూ.60 కోట్లు మంజూరు చేశామని, నరేగా కింద రూ.35కోట్లు, ఎంఆర్ఆర్ కింద రూ.20 కోట్లు, సీఆర్ఆర్ కింద రూ.2కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ మధ్యనే అన్ని కలిపి సుమారు రూ.150 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 10 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. జిల్లా కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని, భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధిలో ఎన్నో మైలురాళ్లు దాటాం..
సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధిలో ఎన్నో మైలురాళ్లు దాటామని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎత్తిపోతల పథకం ఏదని గూగుల్‌లో సెర్చ్ చేస్తే కాళేశ్వరం అని వస్తుందన్నారు. పక్క రాష్ర్టాల నుంచి అనేక బృందాలు వచ్చి అభివృద్ధి చూసి వెళ్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఒక విజన్‌తో పనిచేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు తగ్గట్లుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పని చేస్తున్నారన్నారు.
కరోనా సంక్షోభ సమయంలో పీఎంజీఎస్‌వై నిధుల మంజూరుకు రాష్ట్రం వాటా 40 శాతం చెల్లించాల్సిందేనని పట్టుబట్టి సాధించడం వల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. వికారాబాద్ జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, పేపర్లో ఏ చిన్న వార్త వచ్చినా వికారాబాద్ జిల్లాది ఫలానా వార్త వచ్చిందని స్వయంగా సీఎం చెబుతుంటారని మంత్రి గుర్తు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారన్నారు. కండ్లుండి చూడలేని కబోదులు ప్రతిపక్ష నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నేతృత్వంలో పల్లె ప్రగతితో నేడు గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. అన్ని జిల్లాల్లో నూతన కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు నిర్మించడంతో పాటు జెడ్పీ కార్యాలయాలనూ నిర్మిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జెడ్పీ సీఈవో జానకిరెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.