పరిగి, మార్చి 16 : ఎన్నికల్లో బీఆర్ఎస్తో పోరాడే శక్తి లేక బీజేపీ కుట్ర పూరితంగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయించిందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కాంలో నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరయ్యారని, ఎలాంటి తప్పు లేకున్నా ఈడీచేత కేంద్రం కవితను అరెస్టు చేయించిందని విమర్శించారు. సుప్రీంకోర్టులో కేసు ఈనెల 19వ తేదీన విచారణ జరుగాల్సి ఉండగా అక్రమంగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారన్నారు. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం పరిగిలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ పథకం ప్రకారమే ఈడీ అధికారులు వచ్చి సోదాలు చేసి అరెస్టు చేశారని అన్నారు. ఈ విషయంలో తప్పనిసరిగా న్యాయ పోరాటం చేస్తామన్నారు. గత పదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర పార్టీల్లో పటిష్టంగా ఉన్న నాయకులపై ఈడీ కేసులు, ఇన్కమ్ టాక్స్ దాడులు చేయిస్తుందని ఆయన ఆరోపించారు. కేసులు నమోదు చేయించి బీజేపీ పార్టీలో చేర్చుకుంటుందని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా లేక ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు తెర తీసిందన్నారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత నిర్దోషిగా వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అబద్దపు వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిందని, హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. రూ.2లక్షలు రుణమాఫీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని చెప్పి ఇప్పటివరకు చేయలేదన్నారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారని, గత యాసంగికి సంబంధించి పాత విధానంలో ఎకరాకు రూ.5వేలు పెట్టుబడి సహాయం సైతం ఇప్పటివరకు మూడు నెలల్లో మూడు ఎకరాల వారికే వచ్చిందన్నారు.
మహిళలకు ప్రతినెల ఇస్తామన్న రూ.2500 పథకం ప్రారంభించలేదని, ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారికి రూ.4వేలకు పెంచుతామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకొని వంద రోజులు కాలయాపన చేశారని ఆయన దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పరిగి, పూడూరు ఎంపీపీలు కరణం అరవిందరావు,
మల్లేశం, దోమ జెడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పరిగి పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎ.సురేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు రాజేందర్, బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మలిపెద్ది ప్రభాకర్‌గుప్తా, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు కె.వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, కౌన్సిలర్లు రవీంద్ర, బి.నాగేశ్వర్, ఎదిరె కృష్ణ, వెంకటేశ్, మాజీ సర్పంచ్‌లు జగన్, శ్రీనివాస్, నాయకులు బి.రవికుమార్, రాజు, శ్రీనివాస్, అబ్దుల్ బషీర్ పాల్గొన్నారు.
వికారాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ కుట్రలో భాగమే ఎమ్మెల్సీ కవిత అరెస్టు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవితను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దొంగ నాటకాలను ప్రజలు బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
తెలంగాణలో ఎంపీ ఎన్నికల కోసమే బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్‌రెడ్డి, కమాల్‌రెడ్డి, మల్లికార్జున్‌గౌడ్, పురుషోత్తంరెడ్డి, సుభాన్‌రెడ్డి, శివకుమార్, అశోకు, రాజగుప్త, మాజీ సర్పంచ్ గౌస్, నాయకులు అంజయ్య, సత్యనారాయణ గౌడ్, ఉపేందర్‌రెడ్డి, ముత్తూజ్అలీ, మల్లేశం ముదిరాజ్, రమేశ్, మల్లేశ్ యాదవ్, ప్రవీణ్‌కుమార్, గిరీష్, అనిల్, మహిపాల్, నరసింహ, షఫీ, శ్రీధర్, తేజ పాల్గొన్నారు.