సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఎదుట బల్దియా కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. గురువారం కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కాంట్రాక్టర్లంతా బైఠాయించి రూ. 1500 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘వీ వాంట్ పేమెంట్స్’ అంటూ నినాదాలతో హోరెత్తించా రు. ఎవరినీ కష్టపెట్టడం మా ఉద్దేశం కాదు.. బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చి, చేసిన పనులకు బిల్లులు రాక ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుని బతకలేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు కాంట్రాక్టర్లు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
అక్కడే ఉన్న సహచర కాం ట్రాక్టర్లు ఆ ఇద్దరి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల బాధతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బల్దియా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రామకృష్ణారెడ్డి, సురేందర్ సింగ్ ఆవేదన వ్య క్తం చేశారు. పిల్లల చదువులకు డబ్బులు లేక, వర్కర్లకు ఈపీఎఫ్, బ్యాంకులకు ఈఎంఐలు కట్టలేకపోతున్నామని, ఆర్థిక బాధలతో సడె న్ స్ట్రోక్‌లకు గురై ప్రాణాలు పోతు న్న పరిస్థితులు ఉన్నాయని వాపోయారు. తమ బకాయిలు చెల్లిస్తేనే పనులు జరుపుతామని, రానున్న రోజుల్లో నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
బల్దియా కాంట్రాక్టర్ల ఆందోళనపై కమిషనర్ ఇలంబర్తి స్పందించి వారితో చర్చలు జరిపారు. కాంట్రాక్టర్లు ఎదుర్కొన్న సమస్యలపై ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏడాది కాలం గా బకాయిలు చెల్లించడం లేదని, రూ.1500 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ వచ్చే జూన్ నాటికల్లా రూ. 400 కోట్ల మేర బకాయిలు చెల్లిస్తామని కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. దీంతో కాంట్రాక్టర్లు ఆందోళన విరమించారు.