బడంగ్ పేట, మే 26: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల జులుం తగ్గించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక, తల్లుల సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలలో ఫీజుల నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం చట్టం తీసుకురావాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక, తల్లుల సంఘం నాయకులు నరేందర్, వెంకటస్వామి, సరిత, నరేందర్, ముకుందం డిమాండ్ చేశారు.
రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బాలాపూర్ మండల వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టారు. విద్య వ్యాపారాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చట్టం తీసుకురాకపోతే ఫీజుల నియంత్రణ ఉండదని అన్నారు. బడంగ్‌పేట మండలవ్యాప్తంగా బ్యానర్లు ఏర్పాటుచేసి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సమస్యలను ఏర్పాటుచేసి అవసరమైన సిబ్బందిని నియమించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం అవుతున్న క్రమంలో కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలలో పేద, మధ్య తరగతి పిల్లలను చదివించడానికి లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోయారు. ఫీజులతోపాటు, పుస్తకాల వ్యాపారం, డ్రెస్సులు, షూ,టై, తదితర వాటిని ప్రైవేటు స్కూళ్లలోనే తీసుకోవాలని నిబంధనలు పెట్టారన్నారు.
చాలామంది పేదలు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలలో చదివిస్తున్నారని బాలల హక్కుల పరిరక్షణ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల యజమానుల ఆగడాలకు అంతుపొంతూ లేకుండా పోయిందన్నారు. ప్రతి కార్పోరేట్, ప్రైవేటు పాఠశాలలో 25 శాతం మందికి ఉచితంగా సీటు ఇవ్వాలని చాలా నిబంధనలు ఉన్నప్పటికీ ఏ పాఠశాల అమలు చేయడం లేదని తెలిపారు. ప్రభుత్వాలు చట్టం తీసుకురాకపోవడం వల్లనే ఫీజుల నియంత్రణ లేకుండా పోయిందని అభిప్రాయడపడ్డారు. ఎవరికి వారు అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ పాఠశాలలపై విద్యాధికారుల పర్యవేక్షణ కూడా ఉండటం లేదని అన్నారు. ప్రైవేటు పాఠశాలలో ఫీజులు నియంత్రణ చేసే వరకు సంతకాలను సేకరణ చేపడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. విద్యా హక్కు పరిరక్షణ వేదిక, తల్లుల సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి విద్యా సంవత్సరం ప్రారంభంలోని చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.