బొంరాస్పేట, జూన్ 2 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బడీడు పిల్లలు, ఐదేండ్లు నిండిన వారు, బడి బయటి పిల్లలు, మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిం చేందు కు విద్యాశాఖ ఏటా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు గ్రామాల్లో ఇం టింటికీ తిరిగి బడీడు పిల్లలను గుర్తించి సమీప పాఠశాలల్లో చేర్పించడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్న పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనంతో నాణ్యమైన విద్య గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. బడిబాటకు సంబంధించి రోజువారీగా నిర్వహించే కార్యక్రమాల షెడ్యూలును జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. అన్ని మండలాల్లో బడిబాటను విజయవంతం చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.