విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతి నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ను ఈ విద్యా సంవత్సరమే ప్రవేశపెట్టింది. ఈ మేరకు శనివారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్డేను అమలు చేశారు. మొదటి ‘నో బ్యాగ్ డే’ సందడిగా సాగింది. విద్యార్థులు పుస్తకాల బ్యాగులు లేకుండానే పాఠశాలకు హాజరుకాగా.. ఉపాధ్యాయులు ఆటలు ఆడించడం, యోగా చేయించడం, పాటలు పాడించడం వంటివి నేర్పించారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా వీటిలో పాల్గొన్నారు.
బొంరాస్పేట, జూన్ 24 : ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం నో బ్యాగ్డే అమలు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి నెలా నాలుగో శనివారం నో బ్యాగ్డేగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు దీనిని అమలు చేశారు. విద్యార్థులు పుస్తకాల బ్యాగులు లేకుండానే పాఠశాలకు హాజరయ్యారు. ఉపాధ్యాయులు వీరికి ఆటలు ఆడించడం, యోగా చేయించడం, పాటలు పాడించడం వంటివి నిర్వహించారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
విద్యార్థులపై ఒత్తిడి రాకుండా పుస్తకాల భారాన్ని తగ్గించడంలో భాగంగా ప్రతి నాలుగో శనివారం దీనిని అమలు చేయనున్నారు. ఇందుకోసం ప్రతి నాలుగో శనివారం ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలో సూచిస్తూ 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం ఎన్సీఈఆర్టీ ప్రత్యేక పుస్తకాన్ని కూడా ముద్రించింది. ఇందులో 28 రకాల కార్యకలాపాలున్నాయి. మ్యూజియం, చారిత్రక ప్రదేశాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల సందర్శన, సైన్స్ ప్రయోగాలు, బాలికా విద్యపై స్కిట్, పతంగుల తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గణిత కార్నర్, నమూనా ఎన్నికలు, మాక్ అసెంబ్లీ, ఆర్థిక లావాదేవీల నిర్వహణ వంటివి ఉన్నాయి.