కేశంపేట, మార్చి 23 : పూలసాగుతో లాభాలు అర్జించవచ్చన్న అన్నదాత ఆశలు అడిఆశలవుతున్నాయి. రూ.లక్షలు అప్పులు చేసి పూలతోటల సాగులో పెట్టుబడి పెట్టారు. పంట చేతికొచ్చాక తీరా మార్కెట్లో పూలకు ధర లభించడం లేదు. దీంతో పంటను చేనులోనే వదిలేయాల్సిన దుస్థితి నెలకొన్నది. మండల పరిధిలో చిన్న, సన్నకారు రైతులు బంతి, గులాబీ, కనకాంబరం, మల్లె తదితర పూలతోటలను మండల వ్యాప్తంగా 123ఎకరాల్లో పూలసాగు చేసినట్లు ఉద్యానవన శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఎకరానికి రూ.70వేలకు పైగా ఖర్చుచేసి పూలతోటలు సాగు చేస్తే మార్కెట్లో ధర పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూలకు ధర లేకపోవడంతో పూలు కోసేందుకు వచ్చే కూలీలకు సైతం డబ్బులు ఎల్లడం లేదని, మార్కెట్కు తరలించేందుకు ఆటోలచార్జీలు కూడా రావడంలేదని వాపోతున్నారు. కేశంపేటకు చెందిన నిదురం చెన్నయ్య అనే రైతు సర్వే నంబర్ 760లో అర ఎకరా పొలంలో బంతి పూలతోటను సాగు చేశాడు. నారు మొదలు మొక్కల పెంపకం, వాటిని కాపాడుకునేందుకు కావాల్సిన రసాయన ఎరువులను పిచికారీ చేశాడు. పంట చేతికొచ్చాక మార్కెట్లో ధర లేకపోవడంతో చేసేది లేక చేనులోనే వదిలేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ధరలు లేక పూలు కోయడం మానివేశానని, పూలు కోసి కూలీ డబ్బులు మీద వేసుకోవడంకన్నా చేనులోనే వదిలేయడం నయమని వదిలేసినట్లు చెబుతున్నాడు.
పడిపోయిన పూల ధరలు..
ఒక్కసారిగా పడిపోయిన పూల ధరలు మార్కెట్లో ఇలా ఉన్నాయి. సీజన్లో రూ.120వరకు పలికే బంతి కిలో రూ.40వరకు పడిపోయింది. ఇక చామంతి సీజన్లో రూ.200వరకు పలుకుతుందని, ప్రస్తుతం కిలో 60కి వస్తుంది. సీజన్లో కిలో గులాబీ రూ.250పలుకుతుండగా ప్రస్తుతం కిలో రూ.30కి దిగజారింది. కనకాంబరాలు కిలో సీజన్ సమయంలో రూ.1200 నుంచి రూ.2వేల వరకు పలుకుతుంది. ప్రస్తుతం కిలో రూ.400కు చేరుకుంది. ఇక మల్లె సీజన్లో రూ.1200వరకు పలకగా ప్రస్తుతం కిలో మల్లెపూల ధర రూ.400 విక్రయిస్తున్నారు. పూల ధరలు లేకపోవడంతో రైతులు పూలను కోయకుండా చేనులోనే వదిలేస్తున్నారు. పూలసాగుతో తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం స్పందించి పూలసాగు చేసిన చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.