పరిగి, జూలై 15 : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు అంగన్వాడీలు సోమవారం పరిగిలోని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఇంటిని ముట్టడించి ధర్నా చేశారు. ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.నర్సమ్మ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీలకు తక్షణమే రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ.2లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చొప్పున అందివ్వాలన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదన్నారు. జీవో నంబర్ 10 తీసుకువచ్చి 60 సంవత్సరాలు దాటిన వారందరినీ అతితక్కువ డబ్బులు ఇచ్చి నిర్ధ్దాక్షిణ్యంగా జూలై 30 నుంచి ఇంటికి పంపాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ, వేతనంలో సగం పింఛన్ ఇవ్వాలని, కనీస వేతనం రూ.26వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేశ్, నాయకురాళ్లు మం జుల, స్వరూప, నిర్మల, పార్వతమ్మ, పుల్లమ్మ, సంతోష, నిర్మల, మల్లమ్మ, శ్వేత, కమల, దేవి పాల్గొన్నారు.

కొడంగల్: స్థానిక ‘కడా’ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య మాట్లాడుతూ అంగన్వాడీల సేవలను ప్రభుత్వం గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలు, ఉద్యోగ భద్రత పొందలేక అంగన్వాడీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చాలా రోజులుగా అంగన్వాడీలు నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ చెవిటోడి ముందు శంఖం ఊదిన చందంగా ప్రభుత్వ తీరు ఉన్నదన్నారు. ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వికారాబాద్: కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం.భారతి మాట్లాడుతూ 45 ఏండ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ రేవంత్‌రెడ్డి తక్షణమే నెరవేర్చాలన్నారు. అంగన్వాడీలకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మహిళా నాయకులు మనోహర, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.