బడంగ్ పేట్, జూలై 28: బాలాపూర్ (Balapur) మండల ఆర్ఐ ప్రశాంతి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమయానికి ఎప్పుడూ కార్యాలయానికి రారు అనేది ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఎప్పుడు సీట్లో ఉంటారో, ఎప్పుడూ ఉండరో ఎవరికీ తెలియదు. బాలాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతుంటే, ఉన్న అధికారులు కూడా సక్రమంగా విధులకు హాజరు కాకపోవడం పట్ల తాసిల్దార్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు పునర్ ప్రారంభమవుతున్న సమయంలో పిల్లలకు ఆదాయం, కులం, స్థానిక దృవపత్రాల దరఖాస్తులు కుప్పలు తిప్పలుగా వస్తున్నాయి. వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయవలసి ఉంటుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే విద్యార్థుల సర్టిఫికెట్లు రిజెక్ట్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి
గురుకులాలు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, కౌన్సిలింగ్కు తప్పనిసరిగా కుల, ఆదాయ, స్థానిక ధ్రువపత్రాలను పొందుపరచవలసి ఉంటుంది. సమయం దగ్గర పడుతుండడంతో సర్టిఫికెట్లు సకాలంలో చేతికి రాక విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఆర్ఐ ప్రశాంతి క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే సర్టిఫికెట్లు రిజెక్ట్ చేయడం పట్ల కార్యాలయంలో గొడవ మొదలవుతుంది. గొడవను సద్దుమణిగించడానికి తాసిల్దార్, డీటీ తలలు పట్టుకోవాల్సి వస్తుంది. బడా బాబులకు కల్యాణ లక్ష్మి దరఖాస్తులను ఆమె పరిశీలిస్తున్నారు. ధనవంతులకు కల్యాణ లక్ష్మి చెక్కు వచ్చే విధంగా ఆమె చొరవ తీసుకుంటున్నారు. నిజమైన పేదలకు కల్యాణ లక్ష్మి చెక్కు రాకుండా రిజెక్ట్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆమె చెయ్యి తడిపితే దరఖాస్తులన్నీ సజావుగా సాగిపోతాయన్న ఆరోపణలు వస్తున్నాయి. భూ రికార్డుల సంగతి చెప్పనక్కర్లేదు. కుల దృవీకరణ పత్రాలకు సవ లక్ష కారణాలు చూపి రిజెక్ట్ చేస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. బ్యాంకు వివరాలు తప్పనిసరిగా కావాలని, లేకపోతే రిజెక్ట్ చేస్తానని బాహాటకంగానే ఆర్ఐ ప్రశాంతి చెప్తున్నట్లు దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కుల ధ్రువీకరణ పత్రం కోసం ఎస్సీలు దరఖాస్తు చేసుకుంటే ఎస్సీలు క్రిస్టియన్లు అని రిజెక్ట్ చేస్తున్నట్లు పలువురు దరఖాస్తుదారులు తాసిల్దార్ దృష్టికి తీసుకుపోయారు. తాసిల్దార్ పరిశీలించి హిందువులుగా ఉన్న వాళ్లను క్రిస్టియన్లుగా రిజెక్ట్ చేయడం ఏమిటంటే సదురు ఆర్ఐని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఎస్సీ, క్రిస్టియన్స్ అని ఆయన దరఖాస్తులు సైతం ఆర్ఐ చించివేయడం తాసిల్దార్ కార్యాలయంలో వివాదాస్పదంగా మారింది. తాసిల్దార్ జోక్యం చేసుకొని సదురు దరఖాస్తుదారుల్ని పిలిపించి సర్టిఫికెట్ జారీ చేయించారు.
పై అధికారులు మందలించిన ఆర్ఐ ప్రశాంతిలో మార్పు లేదు
బాలాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ ప్రశాంతి తలనొప్పిగా మారిందని అధికారులు వాపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆర్డీవో ఆమెను మందలించినట్లు తెలిసింది. బాలాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో జరుగుతున్న వివాదాలకు ఆమె కారణభూతమవుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి తిరుగుతున్న ఆమె ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గత వారంలో రెవెన్యూ సదస్సులు ఉన్నాయని తప్పించుకున్న ఆమె ప్రస్తుతం ఎప్పుడు ఏదో ఒక కుంటి సాకు చూపించి తప్పించుకోవడం ఆమెకు ఆనవాయితీగా మారింది.
సమయానికి ఎప్పుడు విధులకు హాజరు కారు?
బాలాపూర్ తాసిల్దార్ కార్యాలయం లో పనిచేస్తున్న ఆర్ ఐ ప్రశాంతి ఎప్పుడు సమయానికి విధులకు హాజరుకారన్న అపవాదులు ఆమె మూటగట్టుకుంటున్నారు. ఆమె ఎప్పుడు కార్యాలయానికి వస్తారో ఎప్పుడు పోతారో కూడ అధికారులకు తెలియని అయోమయ పరిస్థితి. ఫీల్డ్ లో ఉన్నానని, ఎంక్వయిరీ చేస్తున్నానని చెప్పి సమస్యను దాటవేస్తుంటారనేది అధికారులు చెబుతున్న వాదనలు. ఈరోజు కూడా సమయానికి వీధులకు వచ్చిన దాఖలాలు లేవని కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఆమె సమయానికి రాకపోతే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియదన్న వాదనలు ఉన్నాయి.
దరఖాస్తుదారుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి : తాసిల్దార్ ఇందిరా దేవి
దరఖాస్తుదారుల నుంచి ఆరోపణలు వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఆరోపణలు రాకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. సర్టిఫికెట్ల విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఏదీ చూడకుండా రిజెక్ట్ చేయకూడదు. వాస్తవాలను తెలుసుకోవాలి. నిజమైన క్రిస్టియన్లు అయితే బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వచ్చు. నిజమైన ఎస్సీలను ఇబ్బంది పెట్టకూడదు.