వీఆర్ఏల క్రమబద్ధీకరణపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. వీఆర్ఏలను వారి విద్యార్హతను బట్టి వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, సబార్డినేట్లుగా ప్రభుత్వం నియమించనున్నది. ఈ మేరకు సోమవారం పే స్కేల్‌ను వర్తింపజేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇకపై వీఆర్ఏలు సర్కారు ఉద్యోగులుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కానున్నారు. 61 ఏండ్లు దాటిన వీఆర్ఏల వారసులకూ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించనున్నది. ప్రభుత్వ నిర్ణయంతో రంగారెడ్డి జిల్లాలో 614 మంది వీఆర్ఏలకు, వికారాబాద్ జిల్లాలో 980 మందికి మేలు జరుగనున్నది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వీఆర్ఏలు సంబురాలు చేసుకుంటున్నారు. సోమవారం పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
రంగారెడ్డి, జూలై 24 (నమస్తే తెలంగాణ) : వీఆర్ఏలు ఇక సర్కారు ఉద్యోగులుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కానున్నారు. వివిధ శాఖల్లో జూనియర్, రికార్డు అసిస్టెంట్లు, సబార్డినేట్లుగా ప్రభుత్వం నియమించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం పే స్కేలును వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 61 ఏండ్లు దాటిన వీఆర్ఏల వారసులకూ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో రంగారెడ్డి జిల్లాలో 614 మంది వీఆర్ఏలను సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 614 మంది వీఆర్ఏలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలామంది నిరక్షరాస్యులు కాగా.. మరికొందరు ఏడో తరగతి నుంచి డిగ్రీ ఆపై ఉన్నత విద్య వరకు చదివినవారూ ఉన్నారు. ఇన్నాళ్లుగా సరైన గుర్తింపు లేక సామాజిక వివక్షతకు గురైన వీఆర్ఏలను సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునిచ్చారు. 2014 జూన్ 2 తర్వాత 61 ఏండ్లలోపు కలిగి ఉండి వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తూ ఏ కారణం చేతనైనా మరణిస్తే వారి వారసులకూ ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నారు. వీఆర్ఏల్లో డిగ్రీ, ఆపై అర్హత కలిగినవారిని అవసరమైన శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు(వేతనం రూ.24,280-72,850)గా నియమిస్తారు. ఇంటర్ అర్హత ఉన్నవారిని రికార్డు అసిస్టెంట్లు(22,240-63,000)గా, పదో తరగతి చదివినవారిని లాస్ట్ గ్రేడ్ సర్వీస్(రూ.19,000-58,850)గా గుర్తించి ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏల క్షీరాభిషేకం
నందిగామ : వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో వీఆర్ఏలు అనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కొత్తూరు ముఖ్య కూడలిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నో ఎండ్లుగా ఎదురు చూస్తున్న తమ కలను నెరవేర్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏలు హరినాథ్, భాస్కర్‌యాదవ్, యాదయ్య, శేఖర్, భాను, గోపాల్, చంద్రయ్య, బాబు, స్వప్న, అపర్ణ, సుజాత, రామచంద్రయ్య, ముత్యాలు, కుమార్, నారాయణ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం
చేవెళ్లటౌన్ : వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని వీఆర్ఏల సంఘం మండలాధ్యక్షుడు శంకర్ తెలిపారు. ప్రభుత్వం వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసినందుకు సోమవారం సాయంత్రం చేవెళ్లలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకొన్నారు. పేదల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అని వీఆర్ఏలు కొనియాడారు. జీవితాంతం కేసీఆర్‌ను మరచిపోబోమని తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల ఉపాధ్యక్షుడు సత్తయ్య, వీఆర్ఏలు బషీర్, జగన్, అశోక్, ఆంజనేయులు, మల్లేశ్ ఉన్నారు.
సూపర్ న్యూమరరీ పోస్టుల్లో వీఆర్ఏల రెగ్యులరైజ్‌కు నిర్ణయం
వీఆర్ఏ(గ్రామ రెవెన్యూ సహాయకులు) వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్ఏలను మాత్రం సూపర్ న్యూమరరీ పోస్టుల్లో రెగ్యులరైజ్ చేయడంతోపాటు వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు నిర్ణయించింది. ఇన్నేళ్ల మాదిరి కాకుండా ఇకపై వీఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనున్నారు. పే స్కేల్ కూడా ప్రభుత్వం అమలు చేయనుంది. వీఆర్ఏల విద్యార్హతను బట్టి ఉద్యోగ కేటగిరీలను నిర్ణయించనున్నారు. అయితే 61 ఏండ్లకు పైబడిన వీఆర్ఏలకు సంబంధించి వారి వారసులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం విధి విధానాలను రూపొందించింది. వీఆర్ఏల అర్హతను బట్టి నీటి పారుదల శాఖ, మిషన్ భగీరథ, మున్సిపాలిటీ శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 980 మంది వీఆర్ఏలు రెగ్యులరైజ్ కానున్నారు. జిల్లాలో 980 మంది వీఆర్ఏలు ఉండగా, 813 మంది పనిచేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో ఉన్న వీఆర్ఏల విద్యార్హత, వయస్సు తదితర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా రెవెన్యూ యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని వీఆర్ఏలు సంతోషం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకున్నారు.
తాతల నాటి కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్
కొడంగల్ : తాతల కాలం నుంచి వీఆర్ఏ ఉద్యోగంతో వెట్టిచాకిరి చేస్తున్నామని, మంతి కేటీఆర్ పుట్టిన రోజున సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు కానుక అందించడంపై ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని వీఆర్ఏ జేఏసీ చైర్మన్ గోపాల్ తెలిపారు. వీఆర్ఏలకు పే స్కేల్‌తోపాటు చదువును బట్టి ఉద్యోగాలను అందించడంపై సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏండ్ల కాలంగా ఉద్యోగ భద్రత లేకపోవడంతోపాటు చాలీచాలని వేతనాలతో ఇబ్బందుల్లో జీవనం గడిపినట్లు తెలిపారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా వీఆర్ఏల బతుకులు మారలేదని, సీఎం కేసీఆర్ ఆదుకోవడంపై వీఆర్ఏల తరఫున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నామన్నారు. పటాకులు కాలుస్తూ.. స్వీట్లు పంచుకుంటూ పే స్కేల్ సంబురాలు జరుపుకొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
– భాస్కర్, వీఆర్ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎన్నో ఏండ్లుగా రెవెన్యూ శాఖలో సేవలందిస్తున్న వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఉత్తర్వులు జారీ చేసిన సీఎంకు వీఆర్ఏల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. వీఆర్ఏల సేవలను గుర్తించి ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయడం ముదావహం. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.