రంగారెడ్డి, జూన్ 24(నమస్తే తెలంగాణ) : హైబ్రిడ్ విత్తనాలు.. రసాయన ఎరువులు.. పురుగు మందుల వాడకంతో నేలలో సారం తగ్గిపోవడం, పోషకాల సమతుల్యత దెబ్బతినడం వంటివి జరుగుతున్నాయి. ఇవి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భూసార సంరక్షణకు భూసార పరీక్షలు ఎంతో అవసరమని ప్రభుత్వం సంకల్పిస్తున్నది.
ఇందులో భాగంగా ఊరూరా భూసార పరీక్షల ఆవశ్యకతను గుర్తించి ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో మట్టి పరీక్షలను చేపట్టేందుకు నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలో నందిగామ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి ఐదు గ్రామాల్లో సమగ్ర భూసార విశ్లేషణకు కార్యాచరణను జిల్లా వ్యవసాయ శాఖ రూపొందించింది. ఇందుకు సంబంధించి సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయింది. మంగళవారం నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో మొత్తం 930 మట్టి నమూనాలను సేకరించనున్నారు.
రైతులు తమ భూమిలోని సారాన్ని తెలుసుకుని అందుకు తగ్గట్టుగా పంటలను సాగు చేసేందుకు భూసార పరీక్షలు దోహదపడనున్నాయి. సహజంగా మే నెలలోనే మట్టి నమూనాలను సేకరిస్తారు. ఈసారి కొంత ఆలస్యం కావడంతో ప్రస్తుత వానకాలం సీజన్లో అనుకున్న లక్ష్యం మేరకు నమూనాలను సేకరించనున్నారు. గతంలో ప్రతి 25 ఎకరాలకు ఒకటి చొప్పున మట్టి నమూనాలను సేకరించేవారు. అయితే ఈసారి కేవలం రెండున్నర ఎకరాలకు ఒకటి చొప్పున శాంపిల్స్ తీయనున్నారు.

దీంతో పంట క్షేత్రాల సంఖ్య తగ్గి ఎక్కువ నమూనాలను సేకరిస్తుండడంతో ప్రతి అంగుళంలో ఉన్న మట్టి గురించి తెలుసుకునే అవకాశం కలుగనున్నది. ఫలితంగా కచ్చితమైన భూసార పరీక్షలు తెలుస్తాయి. ఈ ఫలితాల ఆధారంగా ఏయే పంటలను సాగు చేయాలో! తెలుసుకునే వీలు రైతులకు కలుగుతుంది. తద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గి భూమి సారవంతం కావడంతో పెట్టుబడులు సైతం గణనీయంగా తగ్గి రైతులకు వెసులుబాటు కలుగనున్నది.
వైవిధ్యమైన పంటల సాగుతో ప్రత్యేకతను చాటుతున్న నందిగామ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో మట్టి నమూనా సేకరణను పకడ్బందీగా చేపట్టనున్నారు. మట్టి నమూనాలను సేకరించిన తర్వాత వ్యవసాయ విస్తరణ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలను సాయిల్ హెల్త్ కార్డు(ఎస్‌హెచ్‌సీ) పోర్టల్ మొబైల్ యాప్‌లో నమోదు చేయనున్నారు. చేగూర్, మామిడిపల్లి, ఏదులపల్లి, నందిగామ గ్రామాల్లో సేకరించిన 600 మట్టి నమూనాలను పరీక్షల కోసం ఇబ్రహీంపట్నంలోని వ్యవసాయ మార్కెట్లోని భూసార పరీక్షా కేంద్రానికి పంపనున్నారు.
నందిగామ, వీర్లపల్లిలలో సేకరించిన 330 నమూనాలను రాజేంద్రనగర్‌లోని సాయిల్ టెస్ట్ ల్యాబ్‌కు పంపనున్నారు. ఆగస్టు నెలలోపు మట్టి నమూనాల విశ్లేషణ ఫలితాలను రైతులకు అందజేయనున్నారు. ప్రతి క్లస్టర్ పరిధిలో ఒక అభ్యుదయ రైతును ఎంపిక చేసుకుని ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఫలితాలను బట్టి అన్ని గ్రామాల్లోనూ విడుతల వారీగా భూసార పరీక్షలను ప్రభుత్వం చేపట్టనున్నది.
భూసార పరీక్షల వల్ల నీటి వాడకంతోపాటు, ఏ మోతాదులో మందులు, ఎరువులు వేయాలో తెలుస్తుంది. తద్వారా పెట్టుబడులు తగ్గడంతోపాటు అన్ని రకాలుగా రైతులకు లబ్ది చేకూరుతుంది. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో మట్టి నమూనాలను సేకరించాక వచ్చిన ఫలితాలకు సంబంధించి రైతులకు నేల ఆరోగ్య కార్డులను అందజేయనున్నాం. దానిలో భూమికి సంబంధించిన సమాచారం పొందుపర్చడం వల్ల పంటల సాగులో రైతులకు ప్రయోజకంగా ఉంటుంది.
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి