వికారాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) ; పండుగ సంతోషాన్ని కాంగ్రెస్ దూరం చేసిందని స్థానికుల పండుగంటే సంబురం.. పండుగంటే సంతోషం..ఇది గత సంవత్సరం వరకు.. బీఆర్ఎస్ హయాంలో ఒక పక్క అభివృద్ధి..మరో పక్క సంక్షేమం పకడ్బందీగా చేపట్టడంతో పండుగొస్తే పల్లె, పట్నం తేడా లేకుండా కొత్త సందడి కనిపించేది. కానీ,..మరో పక్క కనిపించని అభివృద్ధి పనులు..దీంతో పాటు స్థానికులు వద్దని ఉధృతంగా నిరసనలు చేస్తున్నా పట్టించుకోకుండా పచ్చని అడవిలో నేవీ రాడార్ స్టేషన్ చిచ్చు పెట్టగా పరిసర ప్రాంతాల వారు దానివల్ల జరిగే నష్టాలను తలచుకొని భయభ్రాంతులవుతున్నారు. అదే సమయంలో నమ్మి ఓటేసి గెలిపిస్తే, ముఖ్యమంత్రి అయిన తరువాత తమకు మంచి జరుగుతుందని భావించిన కొడంగల్ ప్రజలు ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. దుద్యాల మండలంలో మాకు ఫార్మా పరిశ్రమలు వద్దు మొర్రో అని స్థానిక రైతులు నిరసన దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. ఫార్మా కోసం తమ భూములు ఎక్కడ తీసుకుంటారోనని భయపడుతూ అక్కడి రైతులు కాలం వెళ్లదీస్తున్నారు. బంధుమిత్రులతో పండుగ సంబురాలు జరుపుకోవాల్సిన సందర్భంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా సంబురాలకు దూరమై, సమస్యలతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి దాపురించిందని బాధపడుతున్నారు.
ముప్పని హెచ్చరించినా ముందుకే…
పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో వీఎల్ఎఫ్ రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు, అటవీ ప్రేమికులు గత కొన్నేళ్లుగా ఉద్యమిస్తున్నారు. ప్రకృతి సంపద నెలకొన్న దామగుండంలో రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయొద్దని ప్రజాసంఘాలు, మేధావులు, పార్టీల నాయకులు, అధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు స్వచ్ఛందంగా తరలివచ్చి సేవ్ దామగుండం పేరిట నిరసన వ్యక్తం చేస్తున్నారు. మూసీ, ఈసీ నదులకు పుట్టినిల్లు అయిన దామగుండాన్ని రక్షించుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని రాష్ట్రమంతటా పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు సేవ్ దామగుండం ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. నేవీ రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుండడం, రాడార్ కేంద్రంతో ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం ముందుకెళ్తున్నది. ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించిన స్థానిక ప్రజాప్రతినిధులే దగ్గరుండి భూమి పూజ చేయించడంపై స్థానికంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. అదేవిధంగా వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రంతో మూసీ నది ప్రమాదంలో పడనుందని, రాడార్ కేంద్రం ఏర్పాటుతో మూసీ నదికి మరణశాసనంగా మారనుందని పర్యావరణవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దామగుండం అడవుల్లో రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే నీటి ఊటలు మాయమవుతాయని, భూగర్భజలాలు పూర్తిగా ఎండిపోనున్నాయని, మూసీకి నీళ్లు రావడం కష్టమేనని, మూసీ నది మనుగడ ప్రమాదంలో పడనుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాడార్ కేంద్రం ఏర్పాటుతో మూసీ నదిని ఆదిలోనే అంతం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా సుమారు 300 రకాల పక్షి జాతులు కూడా రేడియేషన్ ప్రభావంతో అంతరించిపోనున్నాయని పర్యావరణవేత్తల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
ప్రజా వ్యతిరేక నిర్ణయాలు..
సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఏర్పాటు చేయ తలపెట్టిన ఫార్మా విలేజ్‌కు ఆది నుంచి అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు మాకొద్దంటూ రైతులు గత మూడు, నాలుగు నెలలుగా ఉద్యమిస్తున్నారు. భూములిచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై భగ్గుమంటున్నారు. ఇటీవల భూములివ్వకపోతే ప్రభుత్వం భూములు లాక్కొని కంపెనీలు ఏర్పాటు చేస్తుందన్న దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై రైతులంతా దాడి చేశారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోయిన పరిస్థితి నెలకొన్నది, అంతేకాదు రైతుల నుంచి అతడిని కాపాడేందుకు పోలీస్ బెటాలియనే దిగివచ్చిందంటే ఫార్మా విలేజ్ ఏర్పాటును ప్రజలు ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్నో ఏండ్లుగా వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్న సాగు భూములను ఫార్మా కంపెనీలకు ఇవ్వమంటే ఊరుకునేది లేదని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీలు పెట్టనీయబోమన్నారు. ఏడాదికి మూడు పంటలు పండిస్తూ సాఫీగా ఉంటున్న తమ కుటుంబాలను ఊర్లకు దూరంగా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలంటున్నారు. ఏటా వరి పంట సాగు చేస్తూ మేం తింటూ, పది మందికి అన్నం పెట్టే పచ్చని సాగు భూముల్లో కాలుష్యం వెదజల్లే కంపెనీలు ఏర్పాటు చేయడంపై కొడంగల్ నియోజకవర్గ రైతులు భగ్గుమంటున్నారు. ఫార్మా విలేజ్ ఏర్పాటు చేసే మూడు గ్రామాల ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే వలసలు పోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకులు ఆగం ఆవుతాయని, ముంబై, దుబాయ్ వలస వెళ్లడమే దిక్కవుతదని వాపోతున్నారు. మేం వేసిన ఓట్లతో రేవంత్ రెడ్డి సీఎం పదవి పొంది మమ్మల్ని రోడ్డు పాలు చేస్తామంటే ఊరుకునేది లేదని, తగిన బుద్ధి చెబుతామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములను ఇచ్చేది లేదంటూ రైతులు భీష్మించుకుని ఉన్నారు.
ఇప్పటికే రైతులకు మద్దతుగా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర, రోడ్లపై ధర్నాలు నిర్వహించారు. తమ గోడును కేటీఆర్, హరీశ్‌రావుల దృష్టికి కూడా రైతులు తీసుకెళ్లారు. మూడు గ్రామాల రైతులు దుద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రతి రోజూ ఏదో రకంగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?
దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్‌ను ఏర్పాటు చేయడం తగదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు. రాడార్ ఏర్పాటుతో అనేక రోగాల బారిన పడే అవకాశమున్నదని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. రామలింగేశ్వరస్వామి ఆలయం ఉన్న చోట ఏర్పాటు చేయడాన్ని ఈ ప్రాంత ప్రజలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి పలువురికి ఉపాధి కల్పించాలి. నేవీ రాడార్ ఏర్పాటు నేపథ్యంలో పలు ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుందనే ఆలోచనతో పండుగను కూడా ప్రశాంతంగా జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడి నుంచి వలస వెళ్లాల్సి వస్తుందేమోననే ఆందోళనలో ఉన్నాం.
– టి.రాజేందర్, పూడూరు గ్రామం
రాడార్‌తో ప్రాణ సంకటం
దామగుండం అటవీ ప్రాంతంలో మేకలు, పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నేవీ రాడార్ ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం ఈ అడవిని నేవీకి అప్పగించింది. ఇప్పుడు అడవిలోకి వెళ్లే అవకాశమే లేదు. అలాగే అడవిలో ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లాలన్న నేవీ అధికారుల పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిర్మాణం చేపట్టకుండా చూడాలి. దీపావళిని కూడా సంతోషంగా జరుపుకోలేని స్థితిలో ఉన్నాం.
– మధసూదన్‌రెడ్డి, పూడూరు గ్రామం
నేవీ రాడార్.. మా బతుకు బేజార్..
దేశ రక్షణ పేరుతో దామగుండం అడవిలో చేపట్టే నేవీ రాడార్‌తో రేడియేషన్‌తో పలు వ్యాధులు సోకే అవకాశాలున్నాయి. అభివృద్ధి పేరిట మా ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. వేసవిలో చల్లటి వాతావరణంలో ఉండే మాకు గుబులు పుట్టిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని వేరే చోటకు తరలించాలి. లేకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తాం. రాడార్ ఏర్పాటుతో మా బతుకు బేజార్ అవుతున్నది. ఏమి చేయాలో పాలుపోవడంలేదు. ఈ పరిస్థితుల్లో పండుగ కూడా సంతోషంగా జరుపుకోలేకపోతున్నాం.
– శ్రీనివాస్‌గౌడ్, పూడూరు గ్రామం
వ్యాధుల బారిన పడతాం
పలు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించే అడవిలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం ఎందుకు. రాడార్ ఏర్పాటుతో స్వచ్ఛమైన గాలికి దూరమవుతాం. భవన నిర్మాణాలకు చెట్లను నరకడం.. రేడియేషన్ ప్రభావంతో కాలుష్యం పలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నది. కనీసం ఆలయానికి వెళ్లాలన్న అధికారుల అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు. గ్రామాలు లేని ప్రాంతాల్లో నేవీ రాడార్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మానసికంగా మేము కుంగిపోతున్న పరిస్థితుల్లో దీపావళి జరుపుకోవాలన్న ఆసక్తి తగ్గింది.
– సతీష్పంతులు, పూడూరు గ్రామం
ఫార్మాతో పండుగ పూట చీకటే..
పచ్చని పొలాల మధ్య ఫార్మా కంపెనీ నెలకొల్పాలన్న ప్రభుత్వ నిర్ణయం రైతులకు అశనిపాతంలాంటిది. దీంతో ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న ప్రజా జీవనం కాలుష్యం మధ్య కకావికలమవుతుంది. ఫార్మా కంపెనీలు కావాలని ఏనాడూ రైతులు కానీ, ప్రజలు కానీ కోరలేదు. కాంగ్రెస్ నాయకుల దుర్మార్గపు చర్యల వల్ల ఇక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. భూములు పోతాయనే ఆందోళన నేపథ్యంలో పండుగ జరుపుకోవాలన్న ఆసక్తి తగ్గింది. దీపావళి మాకు చీకటి రాత్రే.
– కుమ్మరి శివకుమార్, ఫార్మా బాధిత రైతు, హకీంపేట, దుద్యాల మండలం
ఫార్మా వల్ల సంబురాలు లేని దీపావళి
ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సమ్మతించి భూమిని అందిస్తే రూ.10 లక్షలు ఇస్తారంట. లేదంటే రూ.లక్షలిచ్చి లాక్కొంటారంట. రూ.90 లక్షలు పలికే భూమికి రూ.10 లక్షలే ఇస్తామనడం ఎంతవరకు సబబు. ఉద్యోగాలు, ఇంటి స్థలం ఇస్తామంటూ మాయమాటలు చెబుతుండ్రు. ప్రభుత్వాన్ని మేము ఎలా నమ్మాలి. ఇక భూములు వదులుకొని మేము వలస వెళ్లాల్సిందేనా. ఇంత ఆందోళన మధ్య పండుగ ఎలా జరుపుకోవాలి. మాకు సంబురాలు లేని పండుగగా దీపావళి మిగిలిపోనున్నది.
– నీరటి హన్మంతు, లగచర్ల,దుద్యాల మండలం
పండుగ జరుపుకొనేదెలా..
రైతులు భూములను అప్పగించకుండానే ప్రభుత్వం రైతుల భూముల్లో డ్రోన్లతో సర్వేలు చేపడుతున్నది. అడ్డదారుల్లో భూములను లాక్కోనే యత్నం జరుగుతున్నది. ఈ విషయమై ఎవరి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతున్నది. మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భూములు లేకుండా ఎలా బతకాలి. మా జీవనాధారం ఎలా గడవాలి. ప్రభుత్వమిచ్చే నష్టపరిహారం ఏ మూలకు సరిపోతుంది. ఇంతటి బాధ అనుభవిస్తూ పండుగ ఎలా జరుపుకోవాలి. మా బతుకుల్లో వెలుగులు కరువైన ఈ వేళ దీపావళి ఎలా అవుతుంది.
– రూప్లానాయక్, పులిచర్లకుంటతండా, దుద్యాల మండలం