తాండూరు, అక్టోబర్ 23: జిల్లాలో మెట్ట పంటలు రైతులను ఆనంద పరుస్తున్నాయి. ఆగస్టు నుంచి అక్టోబర్ ప్రారంభం వరకు వర్షాలు అనుకూలంగా కురవడంతో వర్షా కాలం పంటల్లో ముఖ్యమైన కంది, పత్తి, మొక్క జొన్న, వరి దిగుబడులు బాగు న్నాయి. జిల్లాలో 2.42 లక్షల ఎకరాల్లో పత్తి, 1.40 లక్షల ఎకరాల్లో కంది, 1.34 లక్షల ఎకరాల్లో వరి, 58 వేల ఎకరాల్లో మొక్క జొన్న రైతులు సాగు చేస్తున్నారు. అనుకూల వర్షాలతో జిల్లాలో మిరప, టమాట, పసుపుతో పాటు అన్ని రకాల పంటలు బాగున్నాయి. దీంతో ఈ ఏడాది మెట్ట పంటలతో దాదాపు రూ.100 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఏపుగా కంది పంట…
మద్దతు ధర ఆశాజనకంగా ఉండడంతో పాటు కందిలో అంతర్ పంటలను సాగు చేసుకునే వెసులుబాటు ఉండడంతో జిల్లాలో ఎక్కువ మంది రైతులు కంది పంటపై మొగ్గు చూపుతున్నారు. కందిలో కలుపు పనులు పూర్తి కావడంతో పాటు ఎదుగు దలకు ఎరువులు వేయడంతో ఇటీవల కురిసిన వర్షంతో కంది పంట ఏపుగా పెరిగింది. జిల్లాలో రైతులు ఎక్కువగా కంది పంటను సాగు చేస్తున్నప్పటికీ పంటలో శనగపచ్చ పురుగు ప్రభావంతో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది రైతులు నష్టపోకుండా వ్యవసాయశాఖ, తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆధ్వ ర్యంలో రైతులకు కంది సస్యరక్షణపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. శనగపచ్చ, మారుక మచ్చల పురుగు నివారణకు ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి నష్టం వాటిల్లదని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్ర వేత్తలు సూచిస్తున్నారు. నల్ల రేగడిలో కంది పంట ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్లు, చెల్క నేలల్లో 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయి. ఈ ఏడాది ఎక్కువ అధిక వర్షాలతో కొంతమేర పంట నష్టం వాటిల్లినా ప్రస్తుతం అనుకూలమైన వాతావరణం ఉండడంతో కంది పంట ఎకరానికి సగటున ఒకటి నుంచి రెండు క్వింటాళ్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తాండూరు డివిజన్లోని తాండూరు, యాలాల, బషీ రాబాద్, పెద్దేముల్, కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట్ మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు కంది పంటను సాగు చేస్తున్నారు.
పూత, కాయ దశలో పత్తి పంట…
జిల్లాలో 1.42 లక్షల ఎకరాల్లో విస్తీర్ణంలో రైతులు సాగుచేస్తున్న పత్తి పంట ఏపుగా పెరిగి పూత, కాయదశలో ఉన్నాయి. పత్తి సగటున ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నల్ల రేగడిలో పత్తి పంట ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్లు, చెల్క నేలల్లో 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయి. ఈ ఏడాది అను కూలమైన వాతావరణం ఉండడంతో పత్తి పంట ఎకరానికి సగటున రెండు నుంచి మూడు క్వింటాళ్లు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడి పోను రైతులకు ఎకరానికి రూ. 50 నుంచి రూ. 60 వేల ఆదాయం వచ్చేందుకు ఆస్కారముంది. జిల్లాలో రెండేం డ్లుగా రైతులు ఎక్కువగా పత్తి పంటను సాగు చేయడంతో పంటలో గులాబీ పురుగు ప్రభావంతో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది రైతులు నష్ట పోకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలలో రైతులకు గులాబీ పురుగు నివారణ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పింక్బౌల్ నివారణకు ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి నష్టం వాటిల్లదని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్ర వేత్తలు సూచిస్తున్నారు.
మొక్క జొన్న పంట…
ప్రపంచ వ్యాప్తంగా ఆహార పంటగా ఉన్న మొక్కజొన్నను జిల్లాలో 58 వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు. ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. పెట్టుబడి పోను రైతులకు ఎకరానికి రూ.25 నుంచి రూ.30 వేల ఆదాయం వచ్చేందుకు ఆస్కారముంది. జిల్లాలో వరి విస్తీర్ణం ఈ ఏడాది మరింత పెరిగింది. 1.34 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేస్తున్నారు. వరికి ప్రస్తుత పరిస్థితులు బాగుండడంతో గత ఏడాదికంటే ఈ సారి ఎక్కువ ఆదాయం రావచ్చని రైతులు భావిస్తున్నారు.