యాచారం, డిసెంబర్ 22 : ఫార్మా భూనిర్వాసితులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కోసం రైతుల వద్ద నుంచి అధికారులు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రెండు కౌంటర్లు ప్రారంభించారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు ఎకరాకు 121గజాల ఇండ్ల స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనికోసం పట్టాలు పొందేందుకు రైతులు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
రైతు ఆధార్ కార్డు, 3 పాస్పోర్ట్సైజ్ ఫొటోలను కౌంటర్లో అందజేస్తున్నారు. కుర్మిద్ద రెవెన్యూలో హవీష్ రియల్ వాల్యూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఆలె చరితారెడ్డి 44 ఎకరాలు, ఆలె వెంకటరమణారెడ్డి 36. 26ఎకరాలతో పాటు మరో 20గుంటల భూమిని గతంలో ఫార్మాకు ఇచ్చారు. ప్రస్తుతం ఇళ్ల స్థలాల కోసం వారు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. మేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామానికి చెందిన ఫార్మ భూ నిర్వాసితులు ఇళ్ల స్థలాల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా పట్టా, అసైన్డ్ పట్టా భూములు కోల్పోయిన రైతులు దరఖాస్తులను అందజేయాలని తహసీల్దార్ సుచరిత కోరారు.