పెద్దఅంబర్‌పేట, సెప్టెంబర్ 12: పెద్దఅంబర్‌పేట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం బలపరీక్ష జరగనున్నది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్నపై అవిశ్వాస తీర్మానం కోరుతూ గతనెల పలువురు కౌన్సిలర్లు కలెక్టర్‌ను కలిసిన విషయం తెలిసిందే. అప్పట్లోనే తమకు పూర్తి మెజారిటీ ఉన్నదని 17 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన పత్రాలను కూడా అందజేశారు.
చైర్పర్సన్ రేసులో ఉన్న పండుగల జయశ్రీ తమవర్గం 17 మంది కౌన్సిలర్లతో క్యాంపులకు తరలివెళ్లారు. వారు క్యాంపుల నుంచి నేరుగా ఉదయమే బలపరీక్ష నిర్వహించే తట్టిఅన్నారంలోని మున్సిపల్ వార్డు కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో పర్యవేక్షణలో 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ పాలకవర్గానికి మరో నాలుగు నెలలే ఉండగా, చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టడం ఆసక్తిగా మారింది.
ఇప్పటికే ప్రస్తుత చైర్పర్సన్ స్వప్నను రాజీనామా చేయించి స్వచ్ఛందంగా తప్పించాలని పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. గతంలోనే అవిశ్వాసానికి ప్రయత్నించినా వారికి మెజారిటీ లేదని, అవిశ్వాసం మీద బలపరీక్షపై స్టే విధించాలని చైర్పర్సన్ వర్గీయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలుస్తున్నది. పార్టీ పెద్దల సూచనతో రాజీనామా చేయాలని తొలుత భావించినప్పటికీ కోర్టు తీర్పు తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
గతం నుంచే ప్రయత్నాలు..
మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. పాలకవర్గం ఏర్పడినప్పుడు 13 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 8 మంది బీఆర్ఎస్ నుంచి, బీజేపీ, సీపీఐ నుంచి ఒక్కొక్కరు చొప్పున స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రెండుగా విడిపోవడంతో ఓ వర్గం మద్దతుతో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన స్వప్నను చైర్పర్సన్ పదవి వరించింది. అయితే, దాదాపు మూడేండ్ల నుంచి చైర్పర్సన్ తీరుపై బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్‌లోని ఓ వర్గం కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. గత ఏడాది చైర్‌పర్సన్‌తోపాటు వైస్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు.
కానీ మెజారిటీ లేకపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు చైర్పర్సన్ స్వప్నతోపాటు మరో ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 17కు పెరిగింది. కానీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లే బీఆర్ఎస్, ఇతర అభ్యర్థుల మద్దతుతో చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. బలపరీక్షలో కోరానికి అనుగుణంగా 17 మంది సభ్యుల మద్దతు ఉన్నదని చైర్పర్సన్ బరిలో ఉన్న పండుగల జయశ్రీ దీమాతో ఉన్నారు. పాలకవర్గం గడువు మరో నాలుగునెలలే ఉన్నప్పటికీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి ముందుకుసాగడం చర్చనీయాంశంగా మారింది. సమయంతో పనిలేకుండా ఏది ఏమైనా పంథం నెగ్గించుకుంటామని ఓ వర్గం కౌన్సిలర్లు స్పష్టం చేస్తున్నారు.