మణికొండ, ఫిబ్రవరి 28 : మణికొండ మున్సిపాలిటీలోని పాషాకాలనీలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. విద్యుదా ఘాతంతో చెలరేగిన మంటలు ఇంట్లోకి ఎగిసిపడి సిలిండర్లు పేలి ముగ్గురు మహిళలు అగ్నికి ఆహుతి అయ్యారు.నార్సింగి ఠాణా పరిధిలోని పుప్పాలగూడ పాషాకాలనీలో జమీలాకాతూన్ (70) తన 15 మం ది కుటుంబసభ్యులతో కలిసి రెండంతస్తుల భవనంలో నివాసం ఉంటున్నారు. కాగా, శుక్రవా రం ఇంట్లోని మగవారు కొంతమంది బయటికి వెళ్లగా గ్రౌండ్ ఫ్లోర్లోని కిరాణా షాపులో అనుకోకుండా విద్యుదాఘాతంతో మంటలు వచ్చా యి. స్థానికులు వెంటనే అక్కడి నుంచి పరుగెత్తడంతో పక్కనే ఉన్న కారుకు మంటలు అంటుకుని అందులోని సిలిండర్ పేలి మొదటి అంతస్తులోని ఇంట్లోకి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఇంట్లోని మరో రెండు సిలిండర్లు పేలా యి.
అప్పటికే ఇంట్లో ఉన్న జమీలా కాతూన్ (70), తహనా కాతూన్(38), సిజ్రా కాతూన్ (4) మంటలలో చిక్కుకుని అక్కడికక్కడే కాలిపోయారు. ఇంట్లోని మరో ఎనిమిది మంది మంటలను చూసి భయపడి రెండో అంతస్తులోకి పరుగెత్తి కేకలు వేయడంతో ఎగిసిపడుతున్న మంటలను చూసిన స్థానికులు అగ్ని మా పక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి అగ్నికి ఆహుతి కావడంతోపాటు మూడు సిలిండర్లు, రెండు కార్లు కాలి బూడిదయ్యాయి. రెండో అంతస్తులో ఉన్న యూనిస్ఖాన్ ప్రాణం రక్షించుకునే క్రమంలో ఆ అంతస్తు నుంచి కిందకు దూకడంతో అతడి కాలు విరిగింది. నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటికి తీసి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఘటనాస్థలికి చేరుకొని వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
పాషాకాలనీలో విషాదఛాయలు
శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పాషా కాలనీలోని ఓ కుటుంబంలోని ముగ్గురు అగ్నికి ఆహుతి కావడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.