రంగారెడ్డి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఓ వెంచర్లో ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన రూ. వంద కోట్ల విలువైన లక్ష గజాల భూమిని నకిలీ ప్రొసీడింగ్ల ద్వారా కొంతమంది తమ పేరున అక్రమంగా బదలాయించుకున్నారు.
ఆర్డీవో నకిలీ ప్రొసీడింగ్ ద్వారా ఈ భూమిని అబ్దుల్లాపూర్‌మెట్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బ్యాంకు ఉద్యోగి, స్థానిక రాజకీయ నాయకులు తమ పేరున మార్చుకున్నారు. ఈ విషయంపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో ఆర్డీవో ప్రొసీడింగ్ బోగస్ అని తేలింది.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, బాటసింగారంలో ని 376 సర్వేనంబర్‌లో 223 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ వారు భారీ వెంచర్‌ను ఏర్పాటు చేశా రు. అందులో వారు ప్రజాప్రయోజనాల కోసం లక్ష గజాల భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఈ వెంచర్‌లోని భూమికి భారీ ధర ఉండడంతో స్థానిక రాజకీయ నాయకులు, ఓ బ్యాంకు ఉద్యోగి నకిలీ ఆర్డీవో ప్రొసీడింగ్‌ను సృష్టించి శ్రీమిత్ర డెవలపర్స్‌లో పనిచేసే ఉద్యోగితో కలిసి ఆ కంపెనీ ఎండీ దశరథ రామయ్య ద్వారా తమ పేర్లకు అక్రమంగా బదిలీ చేయించుకున్నారు.
ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు లోతుగా దర్యాప్తు చేసి ఆర్డీవో ప్రొసీడింగ్ నకిలీదని తేల్చారు. ఈ బదలాయింపు అక్రమమని తేలడంతో శ్రీమిత్ర డెవలపర్స్ ఎండీ దశరథ రామయ్య, మరి కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటికే ఈ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మరికొందరికి విక్రయించినట్లు తెలిసింది. దీంతో గ్రామస్తులు, భూబాధితులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం కలకలం రేపింది. కాగా, ఈ కుంభకోణానికి సంబంధించిన సూత్రధారులను అధికారులు గుర్తించారు.
ఆర్డీవో బోగస్ ప్రొసీడింగ్‌పై విచారణ
శ్రీ మిత్ర వెంచర్లో ఉన్న లక్ష గజాల పంచాయతీ స్థలాన్ని కాజేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఓ బ్యాంకు ఉద్యోగి సృష్టించిన ప్రొసీడింగ్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు జారీ చేశారనే దానిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రొసీడింగ్‌కు సంబంధించి ఆర్డీవో కార్యాలయంలో ఎలాంటి ఫైల్ లేదని తేలింది. ఈ ప్రొసీడింగ్‌ను సృష్టించడంలో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపైనా విచారణ జరుపుతున్నారు. శ్రీ మిత్ర వెంచర్లో ఆక్రమణకు గురైన లక్ష గజాల స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుని ప్రజాప్రయోజనాల కోసం కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.
కన్వర్షన్ ప్రొసీడింగ్ సరైనది కాదు :రెవెన్యూ అధికారులు
బాటసింగారంలోని శ్రీమిత్ర వెంచర్‌ను పంచాయతీ తీర్మానం మేరకు ఏర్పాటు చేశారు. 223 ఎకరాల్లో శ్రీ మిత్ర డెవలపర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లో లక్ష గజాలు గ్రామపంచాయతీ కోసం కేటాయించారు. ఈ స్థలాన్ని కొందరు నకిలీ కన్వర్షన్ ప్రొసీడింగ్ సృష్టించి 2014లో అబ్దుల్లాపూర్‌మెట్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమంగా తమ పేరున మార్చుకున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులైన శ్రీమిత్ర డెవలపర్స్ ఎండీపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణానికి మూలధారమైన కన్వర్షన్ ప్రొసీడింగ్ సరైనది కాదని రెవెన్యూ అధికారులు తేల్చారు.