ఆదిబట్ల, మార్చి 14 : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి గత నెలలోనే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించగా.. ఈ నెల 6 వరకు చివరి తేదీగా నిర్ణయించారు. విద్యార్థుల సౌకర్యార్థం గడువును ఈ నెల 16 వరకు పొడిగించారు. ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనను విజయవంతంగా కొనసాగిస్తున్న గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలను పొందేందుకు విద్యార్థులు ఆసక్తిని చూపుతున్నారు.
10 పాఠశాలలు.. 800 సీట్లు
రంగారెడ్డి జిల్లాలో 10 గురుకుల పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశాలలో 5వ తరగతిలో 80 సీట్ల చొప్పున 800 సీట్లు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 80 సీట్లకు ఎస్సీలు 60, కన్వర్టెడ్ క్రిస్టియన్లు 2, ఎస్టీలు 5, బీసీలు 10, మైనార్టీలు 2, ఓసీ/ఓబీసీలకు ఒక సీటును కేటాయిస్తారు. ఆయా పాఠశాలల్లో ఒక్కసారి ప్రవేశం పొందితే 10వ తరగతి వరకు ఉచితంగా బోధన ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో బాలికల గురుకులాలు సరూర్‌నగర్, నల్లకంచె, కమ్మదానం, మహేశ్వరం, ఆమనగల్లులో ఉండగా.. బాలుర గురుకులాలు ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, కందుకూరు, శంషాబాద్, కొందుర్గులో ఉన్నాయి.
గురుకులాల్లో ఏ రాష్ట్రంలోనూ కల్పించని సౌకర్యాలు
తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రమూ కల్పించని సౌకర్యాలు కల్పించింది. సన్నబియ్యంతో కూడిన రుచికరమైన పోషకాహారం, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, స్టేషనరీ(పెన్సిల్, రికార్డు పుస్తకాలు వంటివి), మూడు జతల స్కూల్ యూనిఫాం, పీటీ డ్రెస్, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ షూ, సాక్స్, నైట్ డ్రెస్, ప్లేట్, గ్లాస్, కటోరా, స్పూన్, బెడ్‌షీట్, బ్లాంకెట్, పరుపులు ఉచితంగా సరఫరా. సబ్బులు కొనేందుకు డబ్బుల పంపిణీ. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో నెలలో నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్‌తో భోజనం. వారంలో నాలుగు రోజులు కోడిగుడ్లు, ఆరు రోజులు పండ్లు పంపిణీ చేస్తున్నారు.
ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు
5వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులు కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆన్లైన్లో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. దరఖాస్తుకు రూ.100 చెల్లించడంతో పాటు, ఒక ఫోన్ నంబర్‌తో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవచ్చు. వేరేవారి ఫొటోలు పెట్టి దరఖాస్తు చేస్తే.. వారిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. దరఖాస్తుదారులకు ఏవైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ నం.180042545678ను లేదా సంబంధిత గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఫోన్లో (ఉ.10.30 నుంచి సా.5 గంటల వరకు) సంప్రదించవచ్చు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2023-23 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్నవారు మాత్రమే అర్హులు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 23న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఈ నెల 16 వరకు స్వీకరిస్తారు. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాణ్యమైన భోజనం అందించడంతోపాటు, ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. రంగారెడ్డి జిల్లాల్లో 10 గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు చేసుకునేందుకు అవకాశం ఉంది.
– నాగకల్యాణి, జిల్లా రీజినల్ కోఆర్డినేటర్