వికారాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో ఒకట్రెండు చోట్ల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో 70 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా పరిగి నియోజకవర్గంలో 66 శాతం పోలింగ్ నమోదు కాగా, తాండూరు నియోజకవర్గంలో 67.30 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, జిల్లావ్యాప్తంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ధారూరు, బొంరాస్‌పేట, కొడంగల్ మండలాల్లోని గిరిజన తండాల్లోని మహిళలు, యువత అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూరు మండలం అల్లీపూర్ గ్రామంలో, తాండూరు పట్టణంలోని నంబర్.1 ఉన్నత పాఠశాలలో దాదాపు అరగంటపాటు ఈవీఎంలు మొరాయించగా, అదనపు ఈవీఎంలను ఏర్పాటు చేయడంతో తిరిగి పోలింగ్ కొనసాగింది. జిల్లావ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మర్పల్లి మండల కేంద్రంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్, వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సంగం లక్ష్మీబాయి పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి తమ కుటుంబ సభ్యులతో ఓటేశారు. దోమ మండలం శివారెడ్డిపల్లిలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, బషీరాబాద్ మండలం ఇందర్చెడ్లో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఆనంద్, పరిగి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తమతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ పూర్తయిన అనంతరం తాండూరు నియోజకవర్గంలోని ఈవీఎంలను సెయింట్ మార్క్స్ హైస్కూల్లో, పరిగి నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలను పరిగి పట్టణంలోని మినీ స్టేడియం, కొడంగల్ నియోజకవర్గంలోని ఈవీఎంలను కొడంగల్ పట్టణంలోని జూనియర్ కాలేజీకి, వికారాబాద్ నియోజకవర్గంలోని ఈవీఎంలను వికారాబాద్ పట్టణంలోని మేరీ నాట్ స్కూల్‌కు తీసుకువచ్చి అక్కడి నుంచి చేవెళ్లలోని లెక్కింపు కేంద్రానికి కేంద్ర బలగాల ఎస్కార్ట్స్ మధ్య తరలించి భద్రపర్చారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.