ఇబ్రహీంపట్నం, మే 24 : హైదరాబాద్ శివారులలోని రంగారెడ్డిజిల్లాలో పారిశ్రామిక ప్రగతి శరవేగంగా పరుగులు పెడుతుంది.. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతుండటంతో ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున రానున్నాయి. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తుండటంతో జిల్లాకు చెందిన నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరశివారుల్లోని రంగారెడ్డిజిల్లాకు చెందిన ఔటర్‌రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, రాజేంద్రనగర్, మహేశ్వరం, కందుకూరు వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రముఖ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. దీంతో ఈ పరిశ్రమల్లో సంపద సృష్టించంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా లభించనున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే రంగారెడ్డిజిల్లాలో ఫార్మాసిటి, ఫ్యాబ్సిటి, టీసీఎస్, ఎరోస్పేస్ వంటి సంస్థలతో పాటు తైవాన్‌కు చెందిన అంతర్జాతీయ ఫాక్స్‌కాన్ కంపెనీ కూడా ఇక్కడే ఏర్పాటు కానుంది. అలాగే, ఆదిబట్లలో ఎల్ఎన్టీ సంస్థకు చెందిన పరిశ్రమ కూడా త్వరలో ఏర్పాటు కానుంది. అలాగే, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బలిజగూడ, మంచాల మండలంలోని తాళ్లపల్లిగూడ వంటి గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములను గుర్తించారు. త్వరలోనే ఈ ప్రాంతాల్లో మరిన్ని కొత్త పరిశ్రమలు రానున్నాయి. ఇప్పటికే టీసీఎస్, ఎరోస్పేస్ వంటి సంస్థల్లో ఈ ప్రాంత వాసులకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఈ ప్రాంత వాసులు ఉద్యోగాలను పొందుతున్నారు.
ఫాక్స్‌కాన్‌తో 30వేల ఉద్యోగాలు..
రంగారెడ్డిజిల్లా కొంగరకలాన్‌లో తైవాన్‌కు చెందిన ప్రముఖ తైవాన్ పరిశ్రమలో ప్రత్యక్షంగా 30వేలమందికి, పరోక్షంగా లక్షమందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీపురపాలకశాఖమంత్రి కేటీఆర్ స్వయంగా వెల్లడించారు. వచ్చే సంవత్సరం నాటికి ఫాక్స్‌కాన్ సంస్థలో ఉత్పత్తులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో పరోక్షంగా నిర్మాణరంగం, రవాణారంగంతో పాటు ఇతర అనుబంధ సంస్థల ద్వారా ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే, త్వరలోనే ఎలిమినేడు గ్రామంలో ఎరోస్పేస్, కార్ల తయారీ వంటి పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఈ పరిశ్రమల్లో కూడా స్థానికులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు విద్యాసంస్థలు, రక్షణరంగసంస్థలు ఏర్పాటైనందున ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభించాయి..
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు..
నగర శివారుల్లోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటై స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీశాఖమంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గత పదేండ్లక్రితం నగరానికి అతిసమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎలాంటి పరిశ్రమలు లేకపోవటం వలన ఉపాధి కోసం నగరానికి వెళ్లేవారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ ప్రాంతానికి చెందినవారు ఇక్కడే ఉద్యోగాలను పొందుతున్నారు.
మంత్రి కేటీఆర్ చొరువతో పరిశ్రమలు
గత ప్రభుత్వాల హయాంలో వెనుకబాటు తనానికి గురైన ఈ ప్రాంతం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరువతో ఈ ప్రాంతంలో ఐటీరంగ సంస్థలు పరుగులు పెడుతున్నాయి. సోమవారం కొంగరకలాన్ సమీపంలో ఏర్పాటుచేసిన ఫాక్స్‌కాన్ కంపెనీలో ఈ ప్రాంతంలోని ఎంతోమంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.
– కల్వకోటు రవీందర్‌రెడ్డి, సహకార సంఘం వైస్‌చైర్మన్ కొంగరకలాన్
ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది
ఈ ప్రాంతం గతంలో దేనికి పనికిరాదని వెలివేసినట్టుగా ఉందని అన్న వారి నోర్లు మూయించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో వెలివేసినట్టుగా ఉన్న ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చొరువతో బంగారంగా మారిందన్నారు. భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో భూములు దొరుకటం కష్టం. ఇంతగొప్పగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– గోపగల్ల మహేందర్‌గౌడ్, కౌన్సిలర్, కొంగరకలాన్
ఎమ్మెల్యే కృషి ఎంతో ఉంది
ఈ ప్రాంతం అభివృద్ధి చెందటంతో ప్రభుత్వ సహకారంతో పాటు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరువ కూడా ఉంది. కొంగరకలాన్ సమీపంలో కలెక్టర్ కార్యాలయం, ఫాక్స్‌కాన్ కంపెనీతో పాటు మరెన్నో సంస్థలు రానుండటంతో ఈ ప్రాంతం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరువతో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రత్యేక కృషి వలన మా జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం.
– ముక్కెర నారాయణ, కొంగరకలాన్