నేటి నుంచి శివారు ప్రాంతాల్లో అందుబాటులోకి..
అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నాగార్జున
ఇబ్రహీంపట్నంలో ఆన్లైన్ టికెట్లు, బస్‌పాస్ కౌంటర్ ప్రారంభం
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 27 : నగర శివారు ప్రాంతంలోని ప్రయాణికులకు ఆర్టీసీ టికెట్లు, బస్‌పాస్‌లు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆయా డిపోల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ నాగార్జున తెలిపారు. సోమవారం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో ఆన్లైన్ ఆర్టీసీ సేవల కౌంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి కోసం సంస్థ మరిన్ని సేవలు అందించాలనే ఉద్దేశంతో అనేక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే బస్ టికెట్లు, బస్‌పాస్‌లు ఇక నుంచి ఎక్కడినుంచయినా బుకింగ్ సౌకర్యంతో పాటు రెన్యువల్ సౌకర్యం కూడా ఆన్లైన్ ద్వారానే కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆర్టీసీ యాప్‌ను ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్‌ద్వారా నగదు రహిత పద్ధతి ద్వారా పొందేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, దివ్యాంగులు, విద్యార్థులు, పాత్రికేయులు, డయాలసిస్ బాధితులకు వివిధ రకాల బస్‌పాస్‌లను జంటనగరాలతోపాటు శివారు ప్రాంతాల్లో సుమారు 42 అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్, బస్‌పాస్ కేంద్రాల్లో ఉదయం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు నగదు ద్వారానే టికెట్లు, బస్‌పాస్‌ల రెన్యువల్వంటివి జరిగేవని.. ఇకమీదట నగదు రహితంగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం డిపోతో పాటు మహేశ్వరం, హయత్‌నగర్ 1, 2, మిధాని, బండ్లగూడ, శంషాబాద్, తుక్కుగూడలో త్వరలో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న కౌంటర్లలో ప్రయాణికులు నగదు రహితంగా టికెట్లను పొందవచ్చునన్నారు. బస్‌పాస్‌ల రెన్యువల్ కూడా చేసుకోవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ బాబునాయక్, సీఐ సరస్వతి, సిబ్బంది పాల్గొన్నారు.