మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Aug 13, 2020 , 00:23:13

ఓడీఎఫ్‌లుగా మున్సిపాలిటీలు

ఓడీఎఫ్‌లుగా మున్సిపాలిటీలు

  • జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం
  • ప్రతి వెయ్యి మందికి కనీసం ఒకటి చొప్పున ఏర్పాటు
  • మొత్తం నిర్మించాల్సినవి 562,పూర్తయినవి 160
  • 15వ తేదీలోగా పూర్తి చేసేలా చర్యలు
  • పనులను పర్యవేక్షిస్తున్న 
  • రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

 రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : జిల్లాలోని పట్టణాలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణాలు గా మార్చేందుకు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 15వ తేదీకల్లా ప్రతి వెయ్యి మందికి కనీసం ఒక మరుగుదొడ్డి నిర్మించాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా లో పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొత్తం 15 మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉండగా జనా భా ప్రాతిపదికన ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్‌ చొప్పున 562 పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించేందుకు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అనుమతులు జారీ చేశారు. అయితే ఇప్పటికే పట్టణాలలో 160 టాయిలెట్లు ఉండడంతో మిగిలిన 380 టాయిలెట్ల నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటిని పరిశుభ్ర నగరాలుగా, బహిరంగ మల, మూత్రవిసర్జన రహిత నగరాలుగా (ఓడీఎఫ్‌) చేసేందుకు ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమాల్లోనూ స్వచ్ఛ సౌచాలయాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్ర దినోత్సవం నాటికి  కొత్తగా మంజూరు చేసిన 380 టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించడంతో పాటు వీటి నిర్మాణ పురోగతిని ప్రభుత్వ మున్సిపల్‌ శాఖ కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ప్రతిరోజు సమీక్షిస్తున్నారు. అయితే, ప్రతి మున్సిపల్‌ పరిధిలో నిర్మించే టాయిలెట్లలో తప్పనిసరిగా 50 శాతం టాయిలెట్లను మహిళలకు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేశారు.  జిల్లాలో వీటి నిర్మాణ పనులను కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌లు పర్యవేక్షిస్తున్నారు.