మంగళవారం 11 ఆగస్టు 2020
Rangareddy - Jul 05, 2020 , 00:24:03

భారీగా పెరిగిన భూగర్భ జలాలు

భారీగా పెరిగిన భూగర్భ జలాలు

  • అధిక వర్షాలతో తీరిన కష్టాలు
  • రైతన్నల ఆనందం
  • బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు 

విస్తారంగా కురుస్తున్న వానలు అన్నదాతల్లో ఆశలను నింపాయి.  రంగారెడ్డి  జిల్లాలోని 25 మండలాల్లో సాధారణ స్థాయి  కంటే 64శాతం ఎక్కువగా వానలు కురిసాయి. దీంతో, ఈ మండలాల్లో  భూగర్భజలాలు విశేషంగా  పెరిగాయి. గత ఏడాది జూన్‌ నెలతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు మూడు మీటర్ల మేర  భూగర్భజలాలు పెరుగడంతో బోర్ల కింద ఎవుసం చేసే రైతులకు సాగునీటికి రంది లేకుండా పోయింది.  గత సంవత్సరం  మొయినాబాద్‌, తలకొండపల్లి మండలాల్లో ప్రమాదకర స్థాయికి పడిపోయినప్పటికీ ఈసారి పరిస్థితి మెరుగు పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు కూడా నిండడంతో రైతులు ఉత్సాహంగా పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు లేకపోయినా జిల్లా జలకళను సంతరించుకుంది. చిన్న నీటి వనరుల్లోనూ నీటి లభ్యత పెరుగడంతో జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి. ఉపరితల నీటి వినియోగం పెరుగడంతో భూగర్భంపై ఒత్తిడి తగ్గింది. భూగర్భ జల కళతో జిల్లాలో పంటల సాగు జోరుగా సాగుతున్నది. గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు పైకి రావడంతో బోర్లు, బావుల కింద పంటల సాగుకు ఢోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూన్‌ నెలలోనే రైతులు విత్తనాలు విత్తుకున్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో రైతులు సంబురపడుతున్నారు. 

సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదు

 జిల్లాలో జూన్‌ నెలలో 91.7మి.మీ సాధారణ వర్షపాతానికిగాను 155మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే కురువాల్సిన వర్షం కంటే  64% అధికంగా కురిసింది. జిల్లాలోని 25 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, ఒక మండలంలో సాధారణ వర్షపాతం నమోదైంది. మరో మండలంలో లోటు వర్షపాతం నమోదు చేసుకుంది. గతేడాది జూన్‌తో పోలిస్తే 21 మండలాల్లో నీటి మట్టం పెరిగింది. మిగతా ఆరు మండలాల్లో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. 40 బావుల లోతు నుంచి నీటి స్థాయి డేటా విశ్లేషణ చేసినప్పుడు 2020 జూన్‌లో సగటు భూగర్భ జలాల మట్టం 19.73 మీటర్లుగా వెల్లడించింది. గతేడాది జూన్‌లో జిల్లావ్యాప్తంగా 16.54 మీటర్లుగా నమోదైంది. ఈ సంవత్సరం మండలాలవారీగా సగటు భూగర్భ జలస్థాయిలతో పోల్చినప్పుడు జిల్లాలో 27 మండలాల్లో 5 మండలాలు 20 మీ. నీటి మట్టంలో ఉండగా.. మిగతా మండలాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. పైకి వచ్చిన భూగర్భ జలాల ఆధారంగా ఇప్పుడు వానకాలం పంట కింద జిల్లాలో బోర్లు, బావుల కింద సాగవుతున్న కూరగాయల పంటలను, ఇతర పంటలైన వరి, కంది, పత్తి పంటలను రైతులు సాగు చేస్తున్నారు.

నాడు పాతాళంలో.. నేడు పైపైకి..

గతంలో జిల్లాలో పలు మండలాల్లో భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లాయి. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో బోర్లు, బావులు నీళ్లు ఇంకిపోయాయి. యాసంగిలో బోర్లు, బావులతోనే పంటకు నీళ్లు అందాయి. గతేడాది కూడా జిల్లాలో ఫరూఖ్‌నగర్‌ 13.49, షాబాద్‌ 4.23, మహేశ్వరం 1.85 మీటర్ల లోతులో ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఈ మండలాల్లో అధిక మీటర్ల లోతులో ఉండి.. సమస్య మరింత తీవ్రంగా మారింది. ఫరూఖ్‌నగర్‌ 30.51, మొయినాబాద్‌ 27.49, తలకొండపల్లి 24.87, షాబాద్‌ 20.02, మహేశ్వరం 22.25 మీటర్ల లోతులోకి ఇప్పటికి కూడా పడిపోయి ఉండగా.. ఆయా మండలాల్లో భూగర్భ జలాలు అనూహ్యంగా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. గతేడాది మొయినాబాద్‌, తలకొండపల్లి మండలాల్లో ప్రమాదస్థాయిలో పడిపోయినప్పటికీ ఈ సంవత్సరం జూన్‌లోనే భూగర్భ జలాలు కొద్దిగా మెరుగైన ఫలితాలను  నమోదు చేసింది. 

ఇక్కడే వర్షాలు..

   శేరిలింగంపల్లి, తలకొండపల్లి, మహేశ్వరం, కేశంపేట, కందుకూరు, కొందుర్గు, షాబాద్‌, గండిపేట, రాజేంద్రనగర్‌, బాలాపూర్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, కడ్తాల్‌, శంషాబాద్‌, మొయినాబాద్‌, కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్‌, చౌదరిగూడ తదితర మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదు కాగా.. సాధారణ వర్షపాతం శంకర్‌పల్లిలో నమోదైంది. అయితే చేవెళ్లలో మాత్రం ఇప్పటికీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ మండలంలో -24% వర్షపాతం నమోదులో ఉన్నది. 

విస్తారంగా..

   గత నాలుగైదు రోజుల నుంచి జిల్లాలో అడపాదడపా వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మరికొన్ని చోట్ల వరదలకు రోడ్లు తెగిపోయాయి. ఇప్పుడు పడుతున్న వర్షాలు విత్తుకు దోహదపడుతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు. జిల్లాలోని ఈసీ, మూసీ వాగులు పొంగిపొర్లాయి. ఈ వాగులు పొంగిపొర్లితే వర్షాలు అధికంగా పడినట్లని రైతులు చెప్పుకుంటారు. ఈ రెండు వాగులు పారగా నగరశివారులోని గండిపేట, హిమయత్‌సాగర్‌లోకి వరద నీరు వచ్చింది. 

మండలాలవారిగా భూగర్భజలాలు..

 అబ్దుల్లాపూర్‌మెట్‌లో 5 నుంచి 10 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా..  ఆమనగల్లు, బాలాపూర్‌, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కేశంపేట, నందిగామ, శంకర్‌పల్లి, చౌదరిగూడ, సరూర్‌నగర్‌, మాడ్గుల, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, కడ్తాల్‌, కొందుర్గు, హయత్‌నగర్‌, గండిపేటలో 10 నుంచి 15 మీటర్ల లోతులో ఉన్నాయి. చేవెళ్ల, కొత్తూరు, మంచాల, శంషాబాద్‌, యాచారలో 15 నుంచి 20 మీటర్లు, ఫరూఖ్‌నగర్‌, మహేశ్వరం, మొయినాబాద్‌, తలకొండపల్లి, షాబాద్‌ 20 మీటర్లకు  పైగా లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. logo