మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Feb 18, 2020 , 02:25:59

వంకరటింకర లేకుండా రోడ్లు..

వంకరటింకర లేకుండా రోడ్లు..

రోడ్డు వంకర, టింకరలు లేకుండా తిన్నగా ఉంటే ట్రాఫిక్‌ జామ్‌లు ఉండవని అధ్యయనంలో తేలింది. అందుకే రోడ్లు నిర్థారిత వెడల్పుకన్నా ఎక్కువ వెడల్పుఉన్నచోట కుదించి ఆ మేరకు ఫాట్‌పాత్‌ల వెడల్పు పెంచాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది.

  • రోడ్డు తిన్నగా ఉంటే ట్రాఫిక్‌ జామ్‌లు ఉండవు
  • సైబర్‌ సిటీ జంక్షన్‌ అధ్యయనంలో వెల్లడి
  • జంక్షన్ల వద్ద పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రోడ్డు వంకర, టింకరలు లేకుండా తిన్నగా ఉంటే ట్రాఫిక్‌ జామ్‌లు ఉండవని అధ్యయనంలో తేలింది. అందుకే రోడ్లు నిర్థారిత వెడల్పుకన్నా ఎక్కువ వెడల్పుఉన్నచోట కుదించి ఆ మేరకు ఫాట్‌పాత్‌ల వెడల్పు పెంచాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. తద్వారా ట్రాఫిక్‌ సమస్యను అరికట్టాలని నిశ్చయించారు. పోలీసు శాఖ సమన్వయంతో దశలవారీగా జంక్షన్ల వద్ద పనులు చేపట్టాలని నిర్ణయించారు. 


సైబర్‌ సిటీ జంక్షన్‌లో డబ్ల్యూఆర్‌ఐ అనే ఏజెన్సీ ట్రాఫిక్‌పై అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా రోడ్డు వంకరలు లేకుండా తిన్నగా ఉంటే జామ్‌లు లేకుండా ట్రాఫిక్‌ సాఫీగా సాగుతున్నట్లు తేలింది. వారి నివేదిక ప్రకారం, సహజంగా మన నగరంలో రోడ్లు ఒక దగ్గర పదిమీటర్లుంటే, మరోచోట పన్నెండు మీటర్లు ఉంటున్నాయి. ఇలా ఉండడం వల్ల రెడ్‌ సిగ్నల్‌ పడినప్పుడు వాహనాలన్నీ వెడల్పుగా ఉన్న ప్రాంతానికి చేరుకొని ఆగుతున్నాయి. ఇలా ఒకేచోట ఎక్కువ సంఖ్యలో చేరుకున్న వాహనాలు గ్రీన్‌ సిగ్నల్‌ పడగానే ఒకేసారి ముందుకు కదిలి రోడ్డు వెడల్పు తక్కువ చోటికి చేరుకొని నిలిచిపోతున్నాయి. ఇలా ఒకచోట వాహనాలు నిలిచిపోతే దాని ప్రభావం చాలా దూరం వరకు ఉంటుంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో వాహనాలు నిలిచిపోవడం తరచుగా జరుగుతుంది. అదే, రోడ్డు తిన్నగా(వంకర టింకరలు లేకుండా సీదాగా) ఉంటే వాహనాలు ఒకేచోట వచ్చి ఆగడం అనేది ఉండదు. దీనివల్ల వాహనాలు ముందుకు కదిలినప్పుడు కూడా ఒకదాని వెంట మరొకటి ముందుకు సాగడం వల్ల జామ్‌ కావడం ఉండదు. 


అందుకే రోడ్లను తిన్నగా ఏర్పాటుచేయాలని సదరు ఏజెన్సీ సూచించింది. రోడ్డు వాస్తవ వెడల్పు తొమ్మిది మీటర్లుంటే సంబంధిత రోడ్డు స్ట్రెచ్‌ మొత్తం తొమ్మిది మీటర్ల వెడల్పు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, అంతకన్నా ఎక్కువ ఉన్నచోట తొమ్మిది మీటర్లకు కుదించి ఆ మేరకు ఫుట్‌పాత్‌ను విస్తరించాలని ఉదాహరణకు మూడు లేన్ల రోడ్డు (తొమ్మిది మీటర్ల వెడల్పు) ఉంటే దాన్ని తిన్నగా అంతే వెడల్పు ఉండేలా రోడ్డుని నిర్మించి వెడల్పు ఎక్కువవున్నచోట రోడ్డును కుదించి ఆ స్థలాన్ని ఫుట్‌పాత్‌ కోసం వినియోగించాలని నిర్ణయించారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ వెడల్పు పెరుగుతున్నప్పటికీ రోడ్డు మాత్రం చిన్నతా అంతటా ఒకే వెడల్పు ఉండేలా తయారవుతుంది. దీనివల్ల ట్రాఫిక్‌ జామ్‌లు తగ్గడమే కాకుండా ఫుట్‌పాత్‌లు వెడల్పు పెరిగి పాదచారులకు మరింత సౌకర్యవంతంగా తయారవుతాయి. రోడ్డు తిన్నగా కావడం వల్ల ట్రాఫిక్‌ జామ్‌లు ఉండవని సదరు ఏజెన్సీ నివేదికలో స్పష్టంచేసింది. పలు నగరాల్లో ఇటువంటి ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చినట్లు, దీంతో మన నగరంలో కూడా ఇటువంటి ప్రయోగమే చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.


మిగిలిన జంక్షన్లలోనూ  ఇదే ప్రయోగం.. 

 సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌కు దారితీస్తున్న మార్గాలన్నింటినీ తిన్నగా చేసిన అనంతరం మిగిలిన జంక్షన్లలోను ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్త్తుంది. దీనిపై పోలీసు, ట్రాఫిక్‌ విభాగాలతో సమావేశాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. మంగళవారం రోడ్లు, ట్రాఫిక్‌ అంశాలపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలీసు, ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు సమావేశమవుతున్నారు. ఇందులో పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ కూడా పాల్గొననున్నారు. సీసీటీవీల ఏర్పా టు, సమీకృత రోడ్ల నిర్వహణ విధానంతోపాటు ట్రాఫిక్‌ సమస్యకూడా చర్చించనున్నారు. రోడ్లను తిన్నగా ఏర్పాటు చేయడం, జంక్షన్లను అభివృద్ధి చేయడంలో పోలీసు విభాగం సహకారం అవసరమని, రెం డు శాఖలు సంయుక్తంగా వీటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.