శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 12, 2020 , 03:50:36

మరో 177 బస్తీ దవాఖానలు

మరో 177 బస్తీ దవాఖానలు
  • స్థలాలు, భవనాలు సిద్ధం!
  • వర్షాకాలానికి ముందే అందుబాటులోకి..
  • వార్డుకు రెండు చొప్పున ఏర్పాటుకు ప్రణాళిక

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : త్వరలో మరో 177 బస్తీ దవాఖానలు ఏర్పాటు కానున్నాయి. వీటికోసం జీహెచ్‌ఎంసీ స్థలాలు, భవనాల ఎంపికను పూర్తి చేసింది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించి తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. వార్డుకు రెండు చొప్పున 150 వార్డులకు గాను 300 దవాఖానలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే వర్షా కాలంలోపు వీటిని సిద్ధం చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం కొనసాగుతున్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు ఇవి అదనం. 


ఢిల్లీలోని మొహల్లా క్లినిక్స్‌ తరహాలోనే నగరంలోని జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా పేదల కోసం రెండేండ్ల క్రితం బస్తీ దవాఖానలను ప్రారంభించారు. దశలవారీగా ఇప్పటి వరకు 123 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయగా, ఒక్కో వార్డుకు రెండు చొప్పున గ్రేటర్‌ పరిధిలో 300 దవాఖానలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా మరో 177 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు స్థలాలను, భవనాలను జీహెచ్‌ఎంసీ ఎంపిక చేసింది. స్థలాలున్న చోట భవనాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం ఐదువేల జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని మొదలు నిర్ణయించినప్పటికీ స్థలాలు, భవనాల కొరత కారణంగా సాధ్యం కాలేదు. దీంతో ప్రస్తుతానికి వార్డుకు రెండు చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఒక్కో దవాఖానలో ఒక డాక్టర్‌తోపాటు ఒక నర్సు, ఒక ఏఎన్‌ఎంను నియమించాల్సి ఉంటుంది. ప్రాథమిక చికిత్సను అందించడంతోపాటు సీజనల్‌ వ్యాధులు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు, షుగర్‌, బీపీ పలు వైద్య పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మందులు కూడా ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న బస్తీ దవాఖానలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోజూ కనీసం 100 మందికి తక్కువ కాకుండా రోగులు వస్తున్నట్లు, సీజన్‌లో రోగుల సంఖ్య భారీగానే ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. 


పాలక మండలి కీలక నిర్ణయం

ఢిల్లీ తరువాత ఇటువంటి దవాఖానలు ఏర్పాటు చేసిన మొదటి మున్సిపల్‌ కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ ప్రత్యేకతను సంతరించుకున్నది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పేదలకు ప్రాథమిక, కనీస వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తేవాలని పాలకమండలి ఏర్పాటైన కొత్తలోనే నిర్ణయం తీసుకోవడం విశేషం. అంతేకాదు, అనుకున్నదే తడవుగా ఢిల్లీని సందర్శించి అవసరమైన కార్యప్రణాళికను రూపొందించి అమలు చేశారు. ముందుగా భవనాలు సిద్ధంగా ఉన్నచోట వైద్య సిబ్బందిని నియమిస్తే వెంటనే ప్రారంభించవచ్చని, స్థలాలు ఉన్నచోట భవనాలు నిర్మించే వరకు కొంత సమయం పడుతుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయినప్పటికీ వచ్చే వర్షాకాలానికి ముందే అన్నింటినీ అందుబాటులోకి తెస్తామని ఆయన భరోసా వ్యక్తం చేశారు.


పేదలకు భరోసానిస్తున్న ‘బస్తీ’ దవాఖానలు..

బస్తీ దవాఖానలు పేదలకు ఎంతో భరోసానిస్తున్నట్లు చెప్పవచ్చు. వైద్యం అత్యంత ఖరీదుగా మారిన నేపథ్యంలో ఉచితంగా వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో బస్తీల్లో నివసించేవారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్‌లు ఎంతో విజయవంతంగా కొనసాగుతుండడంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సహా అధికారులు అక్కడి క్లినిక్‌లను సందర్శించి వాటి తరహాలోనే మన నగరంలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. జీహెచ్‌ఎంసీకి చెందిన కమ్యూనిటీహాళ్లు, భవనాలు, వార్డు కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో మొదటి దశలోనే వీటిని ఏర్పాటు చేశారు. అయితే, భవనాలు, స్థలాల కొరత కారణంగా దశలవారీగా వీటిని విస్తరిస్తున్నారు.


logo