చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి
కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో పట్టభద్రుల దినోత్సవం
మొయినాబాద్, డిసెంబర్ 18 : ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేయడంతో శనివారం పట్టభద్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులకు పట్టాలను ప్రదానం చేయడంతో పాటు కళాశాల టాపర్‌గా, ఆయా బ్రాంచిలలో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ లయన్ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంజీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. జీవితంలో ఎదుగాలంటే క్రమశిక్షణ, పట్టుదల ఉండాలని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు ఉపాధి అవకాశాలను పొందే క్రమంలో సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఉండాలని తెలిపారు. జీవితంలో ఎంత నేర్చుకున్నా తక్కువేనన్నారు. విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నవారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేనిది యవతతో సాధ్యమన్నారు.
జేఎన్టీయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. వినూత్నమైన ఆలోచనలతో కూడిన విద్య ప్రస్తుతం ప్రపంచీకరణలో చాలా అవసరమని చెప్పారు. సాంకేతిక విద్యలో ఎప్పటికప్పుడు పెను మార్పులు వస్తున్నాయని, మార్పులకనుగుణంగా అప్డేట్ కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రోహిత్, ప్రిన్సిపాల్ జాగీర్దార్, ఏవో రవికిరణ్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.