కుష్టువ్యాధి రాష్ట్ర సంయుక్త సంచాలకుడు డాక్టర్ జాన్‌బాబు
బొంరాస్‌పేట, డిసెంబర్18 : కుష్టు వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా అడ్డుకునవచ్చని కుష్టు వ్యాధి రాష్ట్ర సంయుక్త సంచాలకుడు డాక్టర్ జాన్‌బాబు అన్నారు. శనివారం బొంరాస్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు కుష్టు వ్యాధి లక్షణాలు, వ్యాధి గుర్తింపు, చికిత్సపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి సోకిన వ్యక్తికి ప్రాథమిక స్థాయిలో చర్మంపై రాగి రంగు మచ్చలు కనిపిస్తాయని, ఆ స్థానంలో స్పర్శ ఉండదని చెప్పారు. ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటి సర్వేకు వెళ్లినపుడు ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి దవాఖానలకు పంపిస్తే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తామన్నారు. వ్యాధి నిర్ధారణ అయినవారికి సెల్ఫ్ కేర్ కిట్‌ను ఉచితంగా అందిస్తామని చెప్పారు. వ్యాధి ముదిరితే ఆపరేషన్ చేసే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది కుష్టు వ్యాధిపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి సకాలంలో చికిత్స తీసుకునేలా ప్రోత్సహించాలని డాక్టర్ జాన్‌బాబు అన్నారు. కొడంగల్, బొంరాస్‌పేట ప్రాంతాల్లో కుష్టు వ్యాధి కేసులు ఎక్కువగా ఉన్నాయని, వచ్చే ఏడాది జనవరిలో కేంద్రం పరిశీలనా బృందాలు ఈ రెండు మండలాలను సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీంద్ర యాదవ్, డెర్మటాలజిస్ట్ సంతోషి, మహబూబ్‌నగర్ డీపీఎంవో వెంకటాచారి, హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కరాచారి, సూపర్వైజర్ మణిమాల, సిబ్బంది పాల్గొన్నారు.
లెప్రసీపై అవగాహన కల్పించాలి
కొడంగల్, డిసెంబరు 18 : గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు కుష్టు వ్యాధిపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని లెప్రసీ స్టేట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్‌బాబు అన్నారు. శనివారం మండలంలోని అంగడి రాయిచూరు పీహెచ్సీలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు కుష్టు వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే పీహెచ్సీలలో ఉచితంగా మందులు అందజేస్తామని, కేసులు నమోదైన గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించి రోగులు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూడాలన్నారు. బహుళ ఔషధ చికిత్సతో(ఎండీటీ) కుష్టు వ్యాధి పూర్తిగా నయమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ రవీంద్ర యాదవ్, డపీఎంవో ఈశ్వరయ్య, వైద్యాధికారి గౌతంరాజ్ ఉన్నారు.