పెండింగ్ చలాన్లపై రాయితీలు
ఈనెల 31వ తేదీ వరకు చెల్లింపునకు అవకాశం
వికారాబాద్ జిల్లాలో పెండింగ్ చలాన్లు రూ.18.26కోట్లు
మీ సేవ లేదా ఆన్లైన్లో చెల్లింపులు
పరిగి, మార్చి 6: వాహనాల పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు పోలీస్ శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది. టూ వీలర్, త్రీ వీలర్లకు 75 శాతం రాయితీ, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, కార్లు, హెవీ వెహికిల్స్ 50శాతం రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించేలా అవకాశం కల్పించింది. ఈనెల 1వ తేదీతో ప్రారంభమైన డిస్కౌంట్ విధానం 31వ తేదీ వరకు కొనసాగనున్నది. వికారాబాద్ జిల్లాలో రూ.18.26కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మీ సేవతో పాటు ఎస్బీఐ ఆన్లైన్, ఫోన్ పే, టీ వ్యాలెట్, గూగుల్ పే, పేటీఎం, ఇతర బ్యాంకులు, యూపీఐ తదితర ఆప్షన్లతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ శాఖ సూచిస్తున్నది.
పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ప్రభుత్వం వాహనదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. గతంలో చెల్లించాల్సిన చలాన్లు పెరిగిపోవడంతో వాటి ని పూర్తి స్థాయిలో వసూలు చేసుకునేందుకు పోలీసు శాఖ డిస్కౌంట్ ప్రకటించింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఈ రాయితీ కార్యక్రమం ఈనెల 31వ తేదీ వరకు కొనసాగుతుంది. వికారాబాద్ జిల్లా లో పెండింగ్ చలాన్ల మొత్తం రూ.18.26కోట్లు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ- చలాన్ల రూపంలో జరిమానాలను చెల్లించడం ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలిస్తే జిల్లాలో.. ద్విచక్ర వాహనాలకు సంబంధించి 3,06,909 కేసులు పెండింగ్లో ఉండగా వాటికి సంబంధించి రూ. 13,78,51.835 వసూలు కావాలి. త్రిచక్ర వాహనాలకు సంబంధించి 27,325 కేసులు పెండింగ్లో ఉండగా రూ.79,49,850, ఫోర్వీలర్లకు సంబంధించి 78,194 కేసులు, రావాల్సిన మొత్తం రూ.4,21,75, 625, లారీలు, ఇతర వాహనాలకు సంబంధించి 2,701 కేసులు పెండింగ్లో ఉండగా వాటికి సంబంధించి రూ.9,47,470, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు సంబంధించి 1,476 కేసులు పెండింగ్లో ఉండగా వాటికి సంబంధించి రూ.7,10,770 వసూలు కావాలి. పోలీసు శాఖ ఇచ్చిన వెసులుబాటు ను సద్వినియోగం చేసుకుంటూ చాలామంది వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను చెల్లిస్తున్నారు.
రాయితీలు ఇలా..
ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు కార్లు, లారీలు, బస్సులు ఇతర అన్ని రకాల వాహనాలపై పెండింగ్లో ఉన్న చలాన్ల చెల్లింపునకు ఇదో మంచి అవకాశం. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లలో 75శాతం రాయితీ పోను 25 శాతం చెల్లిస్తే సరిపోతుం ది. అలాగే ఆర్టీసీ బస్సులకు 70శాతం రాయితీపోను 30 శాతం చెల్లించాలి, కార్లు, పెద్ద వాహనాలకు 50 శాతం రాయితీ పోను 50శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అన్ని రకాల వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను పూర్తిగా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది.
సద్వినియోగం చేసుకోవాలి
ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవా లి. తమ తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను ఈనెలాఖరు లోపు రాయితీపోను చెల్లిస్తే సరిపోతుంది. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధన లు పాటించి పోలీసు అధికారులకు సహకరించాలి.
–ఎన్.కోటిరెడ్డి, వికారాబాద్ జిల్లా ఎస్పీ
ఈ-చలాన్ల చెల్లింపు విధానం
మీ-సేవా కేంద్రాలు లేదా ఆన్లైన్లో పెండింగ్ చలాన్లను చెల్లించొచ్చు. ఈ-చలాన్ వెబ్సైట్లో ఈసీహెచ్ఏఎల్ఎల్ఏఎన్.టీఎస్పీవోఎల్ఐసీఈ.జీవోవి.ఇన్ సైట్లోకి వెళ్లి వాహన నంబర్ నమోదు చేయగానే పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు కనిపిస్తాయి. పెండింగ్ చలాన్ల సంఖ్య మొత్తం జరిమానాతోపాటు తాజా రాయితీ పోను వాహనదారులు ఎంత చాల్లించాలో కనిపిస్తుంది. ఎస్బీఐ ఆన్లైన్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర బ్యాంకులు, యూపీఐ ఆప్షన్లు తదితర డిజిటల్ వ్యాలెట్లతోపాటు పెండింగ్ చలాన్లను చెల్లించొచ్చు.