రంగారెడ్డి, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి స్థానికంగా ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకంలో భాగస్వాములవుతున్న వారికే బతుకుదెరువు ప్రశ్నార్థకంగా మారింది. మూడు నెలలుగా వేతనాలు అందక ఆయా ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. బడ్జెట్ కేటాయింపులు లేకనే వేతనాలు నిలిచిపోయినట్లు తెలుస్తున్నది.
రోజంతా శ్రమిస్తున్నా..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సహాయ ప్రాజెక్టు అధికారులు, ఇంజినీర్లు, ప్లాంటేషన్ మేనేజర్, ప్లాంటేషన్ సూపర్ వైజర్, జిల్లా అదనపు రిసోర్స్‌పర్సన్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, క్షేత్ర సహాయకులు, పొరుగు సేవల సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏడాదికి సరపడా ప్రణాళికలు సిద్ధం చేసి లక్ష్యం చేరేలా కూలీలకు పనులు కల్పించడం, కొలతలు తీయడం, పరిశీలించడంతోపాటు వివరాలను ఆన్లైన్లో పొందుపర్చడం, హరితహారం వంటి పనులతో తీరిక లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు.
వీరికి వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నది. ఉద్యోగుల జీతాలు, కార్యాలయాల అవసరాల నిమిత్తం కేంద్రం బడ్జెట్ కేటాయిస్తుండగా.. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు వచ్చేవి. 10వ తేదీలోపే ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యేవి. కానీ.. గత మూడు మాసాల నుంచి వీరి వేతనాలకు బ్రేక్ పడింది.
ఇబ్బందుల్లో 178 మంది ఉద్యోగులు..
రంగారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న వివిధ విభాగాలకు సంబంధించి 178 మంది ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ మాసం నుంచి ఇప్పటి వరకు వీరికి వేతనాలు అందలేదు. రాష్ట్ర శాఖలో బడ్జెట్ లేకపోవడం వల్లనే వేతనాలు పెండింగ్‌లో ఉంటున్నాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇంటి అద్దె, ఈఎంఐలు, ఇతర కుటుంబ అవసరాలకు ఇబ్బందులు తప్పడం లేదని ఉద్యోగులు, సిబ్బంది వాపోతున్నారు. అప్పులు జేసి అవసరాలు తీర్చుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయి వేతనాలను విడుదల చేయాలని కోరుతున్నారు.