ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జీవనోపాధి పొందుతున్న ఇతర రాష్ర్టాల కూలీలు
అధికంగా యూపీ, గుజరాత్ల నుంచి జిల్లాకు వలసొచ్చిన కుటుంబాలు
వివిధ పనులు చేసుకుంటూ జీవనం
తెలంగాణ ప్రభుత్వ పాలనపై సంతృప్తి
తమ రాష్ర్టాల్లో ఉపాధి కరువంటూ అసహనం
బీజేపీ పీడిత రాష్ర్టాలుగా వర్ణన
రంగారెడ్డి, జనవరి 8, (నమస్తే తెలంగాణ);‘నిత్యం పని.. మూడు పూటల భోజనం.. పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందుతున్న తెలంగాణలోనే మా బతుకుదెరువు’ అని.. తేల్చి చెబుతున్నారు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కూలీలు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 60 వేల మంది వలస కూలీలు ఉపాధి పొందుతున్నారు. ధాన్యం గోదాంలు, మార్కెట్లు, వికారాబాద్ జిల్లాలోని స్టీల్ ఫ్యాక్టరీల్ల్లో పని చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ర్టాలైన యూపీ, గుజరాత్ నుంచి వచ్చినవారు అధిక సంఖ్యలో ఉన్నారు. తమ రాష్ర్టాల ప్రభుత్వాలు బడాబాబులకు కొమ్ముకాస్తూ పేదలను పట్టించుకోవడం లేదని.. దీంతో అక్కడ జీవనోపాధి కరువై ఇక్కడికొచ్చినట్లు చెప్పుకొచ్చారు. కొన్నేండ్లుగా ఇక్కడ నివాసముంటున్న తమకు తెలంగాణ ప్రభుత్వం అన్నితానై ఆదుకుంటున్నదన్నారు. రేషన్ బియ్యం అందించడంతో మూడుపూటల భోజనం చేస్తున్నామన్నారు. ఎన్నో సంక్షేమ ఫలాలు అందించి అక్కున చేర్చుకుంటుందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, జనవరి 8 : రాష్ట్రం ఏర్పడి తక్కువ సమయం అవుతున్నా అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే తలమానికంగా నిలుస్తున్న తెలంగాణకు ఇతర రాష్ర్టాల నుంచి వలసలు వచ్చి జీవనం సాగిస్తున్నారు. తమ సొంత రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే పని లభిస్తుందని, ఇక్కడే జీవనం సాగిస్తున్నామని, పెండ్లిళ్లు చేసుకొని కుటుంబ సభ్యులను సైతం ఇక్కడికే తీసుకొచ్చి సంతోషంగా ఉంటున్నామని పేర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని పరిగి, వికారాబాద్ ప్రాంతాల్లోని రైస్ మిల్లుల్లో అత్యధికంగా ఇతర రాష్ర్టాల కూలీలే హమాలీలుగా పని చేస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీల్లో అత్యధికంగా బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ర్టాలకు చెందిన కూలీలు పని చేస్తున్నారు. జిల్లాలో సుమారు వెయ్యి మందికి పైగానే వలస కూలీలు ఉన్నారు. దశాబ్దానికి పైగా ఇక్కడే ఉండి పనులు చేసుకుంటున్న వారు సైతం తమ ప్రాంతం కంటే ఇక్కడే బాగుందని పేర్కొంటున్నారు. లాక్డౌన్ సమయంలోనూ వలస కూలీలకు తెలంగాణ ప్రభుత్వం బియ్యం అందజేసి ఆదుకుందని పేర్కొంటున్నారు.
స్టీల్ ఫ్యాక్టరీల్లో అత్యధికంగా ఇతర రాష్ర్టాల వారే..
వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో మూడు స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ మూడింటిలో సుమారు 950 మంది కార్మికులు పని చేస్తుండగా వారిలో 80 శాతానికి పైగా బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలకు చెందిన వారే ఉన్నారు. సుమారు దశాబ్ద కాలంగా సొంత రాష్ర్టాలు వదిలి ఇక్కడ పని చేస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీలో సహాయకుల దగ్గర నుంచి అనేక విభాగాల్లో ఇతర రాష్ర్టాలకు చెందిన వారు పని చేస్తున్నారు. కొందరు ఇక్కడికి వచ్చిన తర్వాత తమ ప్రాంతం వారితో పెండ్లి అనంతరం కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నారు. అవివాహితులకు ఆయా స్టీల్ ఫ్యాక్టరీల్లోనే వసతి సదుపాయం సైతం కల్పిస్తుండగా సుమారు 200 మందికి పైగానే పరిగి పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అద్దె ఇండ్లల్లో ఉంటున్నారు. దీంతోపాటు రైస్‌మిల్లుల్లో, పరిగిలోని మార్కెట్ యార్డులో ట్రేడర్స్ దుకాణాల్లో హమాలీలు సుమారు 300 మంది వరకు పని చేస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న వారికి వారి పని ఆధారంగా వేతనాలు అందుతున్నాయి. రైస్‌మిల్లులు, ట్రేడర్స్ వద్ద కూలీలుగా పనిచేసే వారికి రోజుకు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు కూలీ గిట్టుబాటు అవుతున్నది.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి, జనవరి 8, (నమస్తే తెలంగాణ) : వారంతా వలస కూలీలు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరేడేండ్లుగా జిల్లాలో జీవనం కొనసాగిస్తున్నారు. మరీ ముఖ్యంగా దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కూలీలు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ర్టాల నుంచి తెలంగాణకు వలస రావడమేంటని ఆశ్చర్యపోవద్దు. ఇదీ ముమ్మాటికీ నిజమే. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పేదల సంక్షేమం కోసం చేసిందేమీ లేకపోవడంతో వేల సంఖ్యలో తెలంగాణకు వలసొచ్చి సంతోషంగా జీవిస్తున్నారు. జిల్లాలో పరిశ్రమలు భారీగా ఉండడంతో షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, షాబాద్ తదితర ప్రాంతాల్లో సుమారు 50-60 వేల మంది వలసొచ్చి ఉపాధి పొందుతున్నారు. వీరంతా చచ్చే వరకు తెలంగాణలోనే ఉంటామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నది. స్థానిక ప్రజల కంటే మా రక్షణకే అధిక ప్రాధాన్యతిస్తుండడం చాలా సంతోషమంటున్నారు వలస కూలీలు. బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాల్లో పేదలను పట్టించుకున్న నాథులే లేరట. ఉత్తరప్రదేశ్ సీఎం యోగితోపాటు గుజరాత్ రాష్ట్ర పాలకులు కేవలం బడా బాబులతో దోస్తానా తప్పా పేదల బతుకులను మార్చేందుకు ఏ రోజు ఆలోచించిన పరిస్థితి లేదని ఆయా రాష్ర్టాలకు చెందిన ప్రజలే స్వయాన చెబుతున్నారు. మా రాష్ర్టాల్లో భయంతో బతకాల్సిన పరిస్థితి ఉంటుంది, ఇతర రాష్ర్టాల వారు యూపీకి రావాలంటేనే భయపడుతారు. తెలంగాణ ప్రభుత్వ పాలన బాగుంది. మాకు ఇక్కడే రేషన్ ఇస్తున్నారు. మేం, మా పిల్లలు మూడు పూటలా కడుపు నిండా తింటున్నాం. మా ఊర్లోనే ఉన్నట్లుగా స్వేచ్ఛగా బతుకుతున్నామంటున్నారు యూపీ, గుజరాత్ నుంచి వచ్చిన వలస ప్రజలు. ఇక్కడే ప్రభుత్వ స్కూళ్లలో మా పిల్లలను చదివిస్తున్నాం, పుస్తకాలతోపాటు మధ్యాహ్న భోజనం పెడుతూ కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. కరోనా సమయంలో మహమ్మారీ నుంచి మమ్మల్ని కాపాడేందుకు కొవిడ్ టీకాలను మేం పనిచేసే వద్దకే వచ్చి వేశారు. ఇలా వలస కూలీల క్షేమం కోసం ఎంతో చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు యూపీ, గుజరాత్ ప్రజలు.
ఉపాధి దొరకడం సంతోషకరం..
తెలంగాణ ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పాటు చేసి కూలీలకు ఉపాధి కల్పించడం సంతోషకరం. మా దగ్గర సక్రమంగా పనులు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుని జీవనం సాగించాల్సి వస్తున్నది. గత ఏడాదిగా హైతాబాద్‌లోని కంపెనీలో పని చేస్తున్నా. మా దగ్గరి కంటే ఇక్కడ ఉపాధి మంచిగా ఉన్నది. నాతో పాటు చాలా మంది ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్నారు.-గోకుల్,గుజరాత్
35 ఏండ్లు గడిచాయి ..
కొత్తూరుకు వలస వచ్చి 35 ఏండ్లు గడిచాయి. ఉత్తరప్రదేశ్‌లో జీవనాధారం లేక పొట్టచేత పట్టుకుని కొత్తూరుకు వలస వచ్చాం. ఇక్కడ పరిశ్రమల్లో కూలీ చేసుకుంటూ జీవనం సాగించాం. ఇప్పుడు కొత్తూరులో ఓ ప్లాటు తీసుకుని ఇల్లు కట్టుకుని ఇక్కడే స్థిరపడ్డాం. ఇక్కడే ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, ఓటర్ కార్డు తీసుకుని ఇక్కడి కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఉపయోగించుకుంటున్నాం. రాష్ట్రంలో కేసీఆర్ పాలన బాగుంది.
-మహ్మద్ ఇషా, కొత్తూరు మండలం.
మా సర్కారు కంటే ఇక్కడి సర్కారే గ్రేట్..
కుటుంబాలను పోషించుకునేందుకు మా రాష్ట్రంలో సరైన పని దొరుకదు. పని చేసినా సరిగ్గా జీతాలు ఇవ్వరు. సర్కారు పట్టించుకోదు. ఇక్కడ ప్రతి విషయాన్ని సర్కారు చూసుకుంటున్నది. ప్రతి ఒక్కరినీ బాధ్యతగా భావిస్తున్నది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన మాలాంటి వారికి మంచి భద్రత ఉన్నది. మా దగ్గర ఉన్న సర్కారు ఎలాంటి భద్రత కల్పించదు. మాకు ఇక్కడే బాగుంది.-రవింద్రచౌదరి,ఉత్తరప్రదేశ్
ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్నాం..
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మేము లబ్ధిపొందుతున్నాం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కంటే తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. కేసీఆర్ పాలన మాకు నచ్చింది. పేదలకు అవసరమయ్యే పథకాలు చాలా ఉన్నాయి. మాలాంటి బీద, మధ్యతరగతి వారికి ఎంతో తోడ్పాటునందిస్తాయి. అందులో కల్యాణలక్ష్మి పథకం నాకు ఎంతో నచ్చింది.
-సావిత్రీసేన్, కట్వార గ్రామం, ఇలాహబాద్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం
మా దగ్గర పూట గడవడమే కష్టం..
మాది ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం. మా దగ్గర జీవనోపాధి శూన్యం. పని లేక.. పూట గడవక పస్తులుండెటోళ్లం. దీంతో గతేడాది షాబాద్ మండలంలోని హైతాబాద్ వెల్స్పన్ కంపెనీలో కూలీ పనికోసం వచ్చాను. రోజుకు 12గంటలు అక్కడే పనిచేస్తా. నెలకు రూ.18వేల వరకు ఇస్తున్నారు. నాలాగా చాలామంది ఇక్కడికి వలస వచ్చి పనులు చేసుకుని దర్జాగా జీవనం సాగిస్తున్నారు. తెలంగాణ సర్కార్ మాకు అనేక సంక్షేమ పథకాలను ఇస్తున్నది.-అస్లాంఖాన్, ఉత్తర్‌ప్రదేశ్