రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
జల్పల్లి మున్సిపాలిటీలో మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ
షాబాద్, జనవరి 3: మహిళలు స్వశక్తితో స్వయం ఉపాధి పొందాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని 13వ వార్డు పహాడీషరీఫ్‌లో మహ్మదీయ కాలనీ నివాసితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి.. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో స్వయం ఉపాధి పొందాలని చెప్పారు. తాము ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కల్పించే దిశగా ఎదుగాలని సూచించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్ చెరువును మంత్రి సందర్శించారు. మీర్పేట్ చెరువు తరహాలో ఉస్మాన్‌నగర్‌లో డ్రైన్ వాటర్ రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉస్మాన్‌నగర్ చెరువు భారీ వర్షాలతో పాటు కాలనీలోని డ్రైన్ వాటర్ మొత్తం చెరువులోకి చేరడంతో ముంపుకు గురై రెండు సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.