షాద్‌నగర్‌రూరల్, అక్టోబర్ 1 : గతంలో అనుబంధ గ్రామం, నేడు ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడి అభివృద్ధిని సాధించి ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామాభివృద్ధిలో గ్రామస్తులు భాగస్వాములు కావడంతో అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది ఫరూఖ్‌నగర్ మండలంలోని రామేశ్వరం. జిల్లాలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఉత్తర రామలింగేశ్వర స్వామి ఆలయం గ్రామ ప్రత్యేకం.
గతంలో రాయికల్ గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న ఈ గ్రామం పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ సర్కార్ ప్రత్యేక గ్రామపంచాయతీగా మార్చింది. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వం కేటాయించిన నిధులతో పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. గ్రామంలో 200 కుటుంబాలు ఉండగా, మొత్తం 1100 మంది జనాభా, 550 మంది ఓటర్లు ఉన్నారు. అదే విధంగా గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి.
వందశాతం పన్నుల చెల్లింపు
కొత్త గ్రామపంచాయతీగా ఏర్పడడంతో గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవాలని గ్రామస్తులందరూ ఏకమయ్యారు. 100 శాతం పన్నులు చెల్లిస్తూ గ్రామఖజానాను నింపుతున్నారు. సమష్టిగా నిర్ణయాలు తీసుకోవడంతో గ్రామం మరింత సుందరంగా మారింది.
పల్లె ప్రగతితో రామేశ్వరానికి కొత్తరూపు
ప్రతి పల్లెను అభివృద్ధి పరిచి పట్టణం మాదిరి తీర్చిదిద్దేందుకు సర్కార్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రామేశ్వరం గ్రామస్తులు పూర్తిగా సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పనులు చేపట్టడంతో గ్రామానికి కొత్తరూపు వచ్చింది.
నిధుల కేటాయింపు
అంతర్గత మురుగు కాల్వలకు రూ.రెండు లక్షల యాభై వేలు.
వైకుంఠధామం నిర్మాణానికి రూ.11లక్షలు
చెత్త సేకరణ, ఇతర అవసరాల నిమిత్తం కొనుగోలు చేసిన ట్రాక్టర్, ట్రాలీకి రూ.11లక్షలు
సీసీ రోడ్డు పనులకు సుమారు రూ.5 లక్షలు
ఇలా ప్రతి పైసాను వృథా చేయకుండా గ్రామాభివృద్ధికి వెచ్చించారు. అదేవిధంగా ఇంటింటికీ మిషన్‌భగీరథ ద్వారా నల్లాలు ఏర్పాటు చేసిన నీటిని సరఫరా చేస్తున్నారు. వీధి దీపాలు, 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, సీసీ రోడ్ల నిర్మాణం, పల్లె ప్రకృతి వనం, నీటి ట్యాంక్, రోడ్డుకు ఇరువైపులా పచ్చని మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. పలు అభివృద్ధి పనులతో పాటు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ 5 మొక్కలను పంపిణీ చేశారు.
ప్రతి రోజూ పారిశుధ్య పనులు
గ్రామంలో ఏ వార్డు చూసినా సీసీ రోడ్లతో అందంగా మెరిసిపోతున్నాయి. గ్రామంలో చెత్తాచెదారం లేకుండా ప్రతి రోజూ పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నారు. గ్రామంలో అంతర్గతమురుగు కాల్వలతో రోడ్లు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.
మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం
మా గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఐకమత్యంతో మరింత సుందరంగా చేస్తాం. ప్రతిరోజూ చేత్తను సేకరిస్తారు. ఎక్కడ చెత్త కన్పించకుండా సిబ్బంది శుభ్రపరుస్తారు. చెత్తబుట్టల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి ఇస్తాం. పల్లె ప్రగతితో అభివృద్ధిని సాధిస్తున్నాం.
-రతన్‌సింగ్, గ్రామస్తుడు
గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం
గ్రామంలో పచ్చదనంతో కళకళలాడుతుంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం కన్పిస్తున్నది. గ్రామపంచాయతీగా ఏర్పడినప్పటినుంచి సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ ఆదర్శగ్రామం వైపు అడుగులు వేస్తున్నాం.
-కృష్ణయ్య, గ్రామస్తుడు
గ్రామస్తుల సహకారం బాగుంది
పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామస్తులందరినీ భాగస్వాములుగా చేశాం. గ్రామాభివృద్ధి కోసం చేపట్టే పనులను గ్రామస్తులతో కలిసి నిర్ణయం తీసుకుంటాం. మా గ్రామం ఆదర్శగ్రామంగా మారుతుండడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నాం.
-సంపత్‌కుమార్, సర్పంచ్ రామేశ్వరం