కులకచర్ల, సెప్టెంబర్ 6 : శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా కులకచర్ల మండలం బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారిని దర్శించుకున్నారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొప్పుల అనీల్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వికారాబాద్‌లో..
వికారాబాద్, సెప్టెంబర్ 6 : వికారాబాద్‌లో ఉన్న బుగ్గ రామలింగేశ్వరాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ సూర్యాపేట ఆత్మలింగం దంపతులు స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య రుద్రాభిషేకాలు, పూజలు చేశారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పెద్దేముల్ మండలంలో..
మండల పరిధిలో అంబురామేశ్వర ఉత్సవాలు ముగిసాయి. గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి పూజలు చేశారు. అభిషేకాలు నిర్వహించి, టెంకాయలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాల్లో పెద్దఎత్తున దుకాణ సముదాయాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్చార్జి ఎస్ఐ విశ్వజన్ ఇతర పోలీసు సిబ్బందితో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షించారు. స్వామివారిని డీసీసీబీ మాజీ చైర్మన్, తట్టేపల్లి పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ అంజయ్య దర్శించుకొని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బిచ్చిరెడ్డి, అడికిచెర్ల సర్పంచ్ జనార్దన్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మణ్, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, శేఖర్, చందు, పీఏసీఎస్ సీఈవో రాజమౌళి, ఆలయ కమిటీ సభ్యులు నారాయణగౌడ్, గోపాల్, గెమ్యానాయక్, అంజయ్య, లక్ష్మణ్ ఉన్నారు.
ఫరూఖ్‌నగర్ మండలంలో..
ఫరూఖ్‌నగర్ మండలంలోని ఉత్తర రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నామని ఆలయ అధికారి శ్యామ్సుందరచారి తెలిపారు.