ఎస్ఎస్సీలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉమ్మడి జిల్లా విద్యాశాఖ ప్రణాళిక
డిసెంబర్ 21 నుంచి 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ
ముందంజ, సగటు, వెనుకబడిన అని మూడు గ్రూపులుగా విద్యార్థుల విభజన
చదువులో వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకుంటున్న టీచర్లు
మెరుగైన ఫలితాలే లక్ష్యంగా కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు
ఇప్పటికే పూర్తైన పదో తరగతి సిలబస్
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 23 : పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ నుంచి పదో తరగతి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తుండగా, డిసెంబర్ 21 నుంచి వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్కో ఉపాధ్యాయుడు 5 నుంచి 10 మంది విద్యార్థులను దత్తత తీసుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విద్యార్థుల మేధస్సును బట్టి చదువులో ముందంజ, సగటు, వెనుకబడిన అని మూడు గ్రూపులుగా విభజించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మెరుగైన ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పదో తగరతి సిలబస్ పూర్తి కాగా, మార్చి 1 నుంచి మోడల్ పరీక్షలను నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది.
పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకు జిల్లా విద్యాశాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల మేధస్సును బట్టి చదువులో ముందంజలో ఉన్న విద్యార్థులను ఒక గ్రూపు, సగటు విద్యార్థులను ఓ గ్రూపు, పూర్తిగా వెనుకబడిన విద్యార్థులను మరో గ్రూపుగా విభజించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్కో ఉపాధ్యాయుడు 5-10 మంది విద్యార్థులను దత్తత తీసుకున్నారు. ఈ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా చూడడం వీరి బాధ్యత. సెప్టెంబర్ నుంచి పదో తరగతి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తుండగా.. డిసెంబర్ 21 నుంచి వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఆరు పేపర్లతో కూడిన పరీక్షలుండడంతో అందుకనుగుణంగా విద్యార్థులను సంసిద్ధం చేస్తున్నారు. మరోవైపు పదో తరగతి సిలబస్‌కు సంబంధించి ఇప్పటికే పూర్తికావడంతో అధికారులు ప్రత్యేక తరగతులపైనే దృష్టి సారించారు. గత రెండేండ్లుగా కొవిడ్ ప్రభావంతో విద్యార్థులందరినీ పాస్ చేయగా.. ఈ ఏడాది కరోనా ప్రభావం ఇప్పటికే తగ్గిపోవడంతో మేలో పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యార్థుల దత్తత
జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో డిసెంబర్ 21 నుంచి వంద రోజుల కార్యాచరణ ప్రారంభమయ్యింది. పది ప్రత్యేక తరగతులను గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు.. జిల్లాలోని అర్బన్ ప్రాంతంలోని స్కూళ్లలో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టుపై ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ రోజుకో ఉపాధ్యాయుడు ప్రత్యేక తరగతుల్లో పాల్గొంటున్నారు. ప్రతీ సంవత్సరం మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లోనే ఫెయిల్ అవుతుండడంతో ఆ సబ్జెక్టులపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది పునరావృతంకాకుండా తగు చర్యలు చేపడుతున్నారు. ప్రతీ చాప్టర్‌కు సంబంధించిన విద్యా ప్రమాణాలకనుగుణంగా ప్రశ్నలు రూపొందించడం, విద్యార్థుల స్థాయిని నిర్ధారించి మూడు గ్రూపులుగా విభజించడం, మూల్యాంకన గుర్తుల ఆధారంగా సాధనలను రాసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
మార్చి 1 నుంచి మోడల్ పరీక్షలు
నూతన పరీక్షా విధానం ప్రకారం జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మోడల్ పేపర్లను తయారు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు వందరోజుల కార్యాచరణలో భాగంగా ప్రధానంగా మాదిరి ప్రశ్నాపత్రాలపై విద్యార్థులతో కసరత్తు చేయిస్తున్నారు. గతంలో 11 ప్రశ్నాపత్రాలు ఉండగా, 40 మార్కులతో కూడిన ప్రశ్నాపత్రాన్ని తయారుచేసేవారు. ఈ ఏడాది నుంచి ఆరు పేపర్లు ఉండనున్నాయి. ఒక్కో పేపర్‌కు 80 మార్కులుకాగా, మరో 20 మార్కులు ఇంటర్నల్ మార్కులుంటాయి. కొత్త ప్రశ్నాపత్రాలకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ మార్చి 1 నుంచి మోడల్ పరీక్షలను నిర్వహించేందుకు నిర్ణయించింది. ఫైనల్ పరీక్షలు పూర్తయ్యేలోగా 3 మోడల్ పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు.
వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు
– డీఈవో సుశీంద్రరావు
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాం. డిసెంబర్ నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. సిలబస్ ఇప్పటికే పూర్తికాగా, ప్రత్యేక తరగతులపై దృష్టి పెట్టాం. వచ్చే నెల ఒకటో తేది నుంచి మోడల్ పరీక్షలను నిర్వహించనున్నాం. జిల్లావ్యాప్తంగా 270 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలుండగా ఈ ఏడాది 45 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు.