సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారన్నారు. సకల వసతులు, పాడి పంటలతో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శం నిలుస్తున్నదన్నారు. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ నేతలు చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 20 : సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం నంబర్-1 స్థానంలో ఉందని, అందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు అవార్డులే దీనికి నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణలోని ప్రతి వ్యక్తి ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా తయారుచేయాలని ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారన్నారు. ఇలాంటి తెలంగాణలో బీజేపీ చిచ్చుపెట్టాలని ప్రయత్నం చేస్తున్నదని, ఆ ప్రయత్నాలను తిప్పికొట్టే అవకాశం ఇప్పుడు మునుగోడు ద్వారా వచ్చిందన్నారు.
దేశంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఏఒక్కరు కూడా సంతోషంగా లేరన్నారు. పింఛన్లు అందజేయడంలో బీజేపీ పాలిత రాష్ర్టాలకంటే తెలంగాణానే ముందుందన్నారు. బీజేపీపాలిత రాష్ర్టాల్లో 300ల పింఛన్ ఇస్తుండగా, తెలంగాణలో రూ.2016 పింఛన్ ఇస్తున్నామన్నారు. అలాగే.. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించటంతోపాటు ఆర్థికంగా వారిని బలోపేతం చేయడం కోసం మహిళా సంఘాలను ప్రోత్సహించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
ప్రభుత్వానికి, మహిళా సంఘాలకు మధ్య వారధిలా పనిచేస్తున్న వీవోఏలకు దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో వేతనాలు ఇస్తున్నామన్నారు. ఆ వేతనాలను మరింత పెంచేందుకు అలాగే, వారికి డ్రెస్ కోడ్, ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలను కూడా త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించనున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని అన్నారు. పట్టణ, పల్లె ప్రగతిల ద్వారా గ్రామాలు, పట్టణాలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ అవార్డులు కూడా దేశంలోనే తెలంగాణకు అత్యధికంగా వచ్చాయన్నారు.
త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంఘాలు నిర్ణయాత్మకమైన శక్తిగా మారనున్నారని చెప్పారు. మహిళా సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం అనేక పథకాలను తీసుకురానుందన్నారు. ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా తెలంగాణ మహిళా సంఘాలకు ప్రభుత్వం పెద్దఎత్తున రుణాలు అందజేస్తున్నదన్నారు. మహిళా సంఘాలు తయారుచేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కింద తయారైన వస్తువులను కొనుగోలు చేయడానికి పలు విదేశీ కంపెనీలు పోటీపడుతున్నాయన్నారు. త్వరలోనే మహిళా సంఘాలకు గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా అప్పజెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సోలార్ సిస్టం వంటి పనులను కూడా మహిళా సంఘాలకే అప్పగిస్తామన్నారు. మహిళలంతా ఆలోచించి అభివృద్ధివైపు నిలబడాలని, అభివృద్ధి నిరోధకులైన బీజేపీని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
గతంలో మునుగోడుకు ఆడపిల్లను ఇవ్వాలంటేనే ముందుకురాని పరిస్థితి ఉండేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మునుగోడులో తాగునీటిలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉండి ఆ ప్రాంత ప్రజలు అనేక దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారని, అలాంటి పరిస్థితుల నుంచి మునుగోడు ప్రజలకు మిషన్ భగీరథద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికీ తాగునీరు అందించి ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపారన్నారు. మునుగోడు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అనేక దఫాలుగా నిధులు కేటాయించిన కాంగ్రెస్‌లో ఉన్న బీజేపీ అభ్యర్థి రాజ్‌గోపాల్‌రెడ్డి మోకాలు అడ్డువేశారని అన్నారు.
సెర్ప్ ఉద్యోగులు మునుగోడులో ఉద్యోగంలా కాకుం డా ఉద్యమంలా పనిచేయాలన్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మీ వెంట నేనున్నానని ధైర్యంగా సెర్ప్ ఉద్యోగులు ముందుకొచ్చి తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధిని మహిళలకు వివరించాలన్నారు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు, రుణాల అందజేతను వివరించాలన్నారు.
మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి రూ.18వేల కోట్లకు అమ్ముడుపోయారని ఆ డబ్బుతో మునుగోడులో గెలువాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. డబ్బుతో ఏదైనా కొనాలనుకునేవారికి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ముఖ్యంగా గ్రామాలకు ప్రచారానికి వచ్చే బీజేపీ నేతలను, తెలంగాణ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్న వ్యత్యాసంపై ప్రశ్నించాలన్నారు. తెలంగాణలో అంగన్వాడీలు, ఆశావర్కర్లు, వీవోఏలు, ఏఎన్ఎంలు తదితరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక ప్రోత్సాహకాలను అందిస్తూ వేతనాలను పెంచడంతోపాటు వారికి పీఆర్సీని కూడా ప్రకటించారని తెలిపారు. తెలంగానలో అంగన్వాడీలకు రూ.14వేలు ఇస్తే బీజేపీ పాలిత రాష్ట్ట్రాల్లో మూడు నుంచి నాలుగువేల వేతనాలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఆశవర్కర్లకు తెలంగాణలో రూ.10వేల వేతనాలు ఇస్తుండగా.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రూ.3వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. మనం సాధించుకున్న రాష్ట్రంలో మనందరం బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. మనమంతా మరింత బలోపేతం కావాలంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ను గెలిపించాల్సిన అవసరం ఉందని.. ఇందుకు ఉద్యోగి పనిచేసి మునుగోడును సీఎంకు బహుమతిగా ఇవ్వాల్సిన అవసరముంది.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి గర్వంగా తలెత్తుకునే పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే వచ్చిందన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. అలాగే, మహిళల్లో ఆర్థిక విప్లవం తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రిదేనని.. సెర్ప్ ఉద్యోగులంతా కీలకంగా పనిచేసి టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు మాధవి, సంఘం నాయకులు నర్సయ్య, రాంబాబు, గంగిరెడ్డి, రూప్సింగ్ పాల్గొన్నారు.