పాఠశాల గోడలపై విద్యకు సంబంధించిన బొమ్మలు.. ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన
ఆటాపాటలతో పాటు క్రమశిక్షణగా విద్యార్థులు
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో అన్ని రకాల మౌలికవసతులు
పాత కొడంగల్ ప్రాథమిక పాఠశాలలో ప్రతి ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
కొడంగల్, ఫిబ్రవరి 13 : తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయి. సకల సౌకర్యాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందుతుండడంతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు వస్తున్నాయి. కొడంగ్ మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్ ప్రాథమిక పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందుతుండడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయుడు క్రాంతికుమార్, ఉపాధ్యాయురాలు సంధ్య అర్థమయ్యే రీతిన విద్యాబోధన చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులు స్వతహాగా ఆలోచించే విధంగా బొమ్మలను, పరికరాలను ఏర్పాటు చేసి పాఠాలను బోధిస్తున్నారు. ఇంగ్ల్లిష్పై విద్యార్థులు పట్టు సాధించేలా ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు.
చదువులు చెప్పే పాఠశాల గోడలు..
ఆట, పాటలతో విద్యార్థులకు బోధన అందిస్తే త్వరగా అర్థం చేసుకోవడంతో పాటు ఇట్టే గుర్తు పెట్టుకునే అవకాశం ఉన్నది. కొడంగల్ పట్టణానికి చెందిన కోట్రికె శ్రీనివాస్ కుమార్తె ప్రతిభ సహకారంతో పాఠశాల ఆవరణలోని తరగతి గదుల్లో పాఠ్యాంశాలకు అనుగుణంగా బొమ్మల రూపంలో అక్షరాలు, గుణింతాలు, దేశ, రాష్ట్ర చిహ్నాలు, దేశ నాయకులు తదితర వాటిని చిత్రీకరింపజేశారు. బొమ్మలను అనుదినం చూస్తుండటం వల్ల వాటిని మననం చేసుకుని ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
వాట్సాప్లో తరగతుల నిర్వహణ..
కరోనా నేపథ్యంలో వాట్సాప్ యాప్ ద్వారా తరగతులను నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ పోత్సహించారు. సర్వశిక్షా అభియాన్ సంస్థ ప్రాథమిక విద్యార్థుల కోసం కథలతో కూడిన పాఠాలు బోధించడానికి అందుబాటులోకి తీసుకొచ్చిన వాటిని అనుసరిస్తూ విద్యార్థులచే బొమ్మలను తయారు చేయిస్తూ చదువుపై ఆసక్తిని పెంచారు. నవోదయ, గురుకుల, సైనిక స్కూళ్ల మాదిరిగా పరీక్షలు నిర్వహించి పోటీ పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నారు.
గణితంపై విద్యార్థులకు ఆసక్తి..
జీవితం గణితంతో ముడిపడి ఉంటుందని, గణిత శాస్త్రంపై ఆసక్తిని పెంచేందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. గణితమేళా వంటి చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులచే గణితశాస్ర్తానికి సంబంధించిన పరికరాలను తయారు చేయించి ప్రదర్శింపజేస్తున్నారు. గణితంపై పట్టు ఉంటే, ఉన్నత చదువుల్లో రాణించే ఆస్కారం ఉంటుందని ఆ దిశగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
ఉపాధ్యాయుల కృషి అభినందనీయం..
విద్యార్థుల బాగా చదివేలా ఉపాధ్యాయులు చూపుతున్న శ్రద్ధ అభినందనీయం. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రులకు భరోసా పెరిగింది. ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది.
– ఆంజనేయులు, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్, పాత కొడంగల్