ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 6: ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువలో తీసుకురావాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అమ్మ ఒడి వాహనాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఫోన్ చేసిన నిమిషాల్లోనే వాహనాలు గ్రామాల్లోకి వెళ్లి సత్వర వైద్యం అందించేలా పనిచేస్తున్నాయి. గర్భిణులకు వెంటనే వైద్య సేవలందించడంతో పాటు వారిని తిరిగి ఇంటి వద్ద వదిలివేయడానికి 102 వాహనాలు నిరంతరం పనిచేస్తున్నాయి.
జిల్లావ్యాప్తంగా 11 అమ్మ ఒడి వాహనాలు
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 11 అమ్మ ఒడి వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను పెంచడం కోసం ఈ వాహనాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. ప్రైవేటు దవాఖానలకు వెళ్లి ప్రసవాలు చేసుకునే స్థోమతలేని వారు ఈ వాహనాలకు ఫోన్ చేస్తే, వెంటనే అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామాల్లోని ఆశావర్కర్లు, గర్భిణుల పేర్లను నమోదు చేసుకుని వారికి నెలనెలా వైద్య సేవలందిస్తున్నారు. ప్రసవ సమయంలో వారిని క్షేమంగా దవాఖానకు తీసుకెళ్లి కాన్పు చేయించి, ఇంటికి చేరుస్తున్నారు. ఈ వాహనాలు ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, సరూర్‌నగర్, వనస్థలిపురం, మహేశ్వరం, ఆమనగల్లు, కొందుర్గు, షాద్‌నగర్, చేవెళ్ల, కొత్తూరు, కొండాపూర్ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలోని ఏరియా దవాఖానల్లో అందుబాటులో ఉంటున్నాయి. మారుమూల ప్రాంతాల్లోనూ ఈ వాహనాలు సేవలందిస్తున్నాయి.
8 నెలల్లో 32 వేల మందికి సేవలు
జిల్లావ్యాప్తంగా ఉన్న అమ్మ ఒడి వాహనాలతో ఎనిమిది నెలల్లో 32 వేల మందికి సేవలందించినట్లు 102 జిల్లా ప్రత్యేకాధికారి రమేశ్ తెలిపారు. జిల్లాలోని అన్ని ఏరియా దవాఖానల్లో ఈ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. జనవరిలో 5746, ఫిబ్రవరి 3442, మార్చి 4636, ఏప్రిల్ 4260, మే 2140, జూన్ 4358, జూలై 5354, ఆగస్టులో 3825 మందికి సేవలందించినట్లు తెలిపారు.
కేసీఆర్ కిట్‌తో పెరిగిన ఆదరణ
ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు చేసుకుంటే కేసీఆర్ కిట్ ఇస్తుండడంతో పేద, మధ్య తరగతి గర్భిణులు ఎక్కువగా ప్రసవాలకు వస్తున్నారు. రోజూ వందలాది మంది గర్భిణులు దవాఖానల్లో చికిత్సలు చేయించుకుంటున్నారు. గర్భిణి ఏడో నెల నుంచి మూడు చెకప్‌లను దవాఖానల్లో తప్పనిసరిగా చేయించుకునేందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ చెకప్‌లు చేయించుకుంటేనే కేసీఆర్ కిట్‌కు అర్హత ఉంటుంది.
తల్లీబిడ్డలకు అమ్మ ఒడి ఎంతో సురక్షితం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి ప్రత్యేక వాహనాలు తల్లీబిడ్డలకు సురక్షితంగా ఉంటున్నాయి. దవాఖానల్లో ప్రసవం అయిన తరువాత తల్లీబిడ్డలను ఉచితంగా వారి ఇంటికి చేరుస్తున్నాయి. 102 పేరుతో ఈ వాహనాలు సేవలందిస్తున్నాయి. గర్భిణులను పరీక్షల కోసం దవాఖానకు తీసుకొచ్చి, సురక్షితంగా వారి ఇంటి వద్ద విడిచిపెడుతున్నాయి.