తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ఆలయాల అభివృద్ధి
ఆధ్యాత్మికత పెంపునకు దేవాలయాల అభివృద్ధి తప్పనిసరి
యాదాద్రి నిర్మాణంతో సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలువనున్నది..
ఆలయ భూములను కాపాడుకుందాం
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నజ్దిక్‌సింగారం సీతారామాంజనేయ స్వామి ఆలయంలో పూజలు
నందివనపర్తిలోని ఓంకారేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి
నజ్దిక్‌సింగారం ఆలయానికి మంత్రి రూ.17లక్షలు మంజూరు చేయడం సంతోషకరం : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
యాచారం, ఫిబ్రవరి20: అతి పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. యాచారం మండలంలోని నజ్దిక్‌సింగారంలో పునర్నిర్మించిన సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాల్లో ఆయన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు నందివనపర్తిలో సర్పంచ్ ఉదయశ్రీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని అతి పురాతన ఓంకారేశ్వరాలయంలో కొలువుదీరిన శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రి, ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రికి గ్రామస్తులు విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు ఐక్యంగా ఉండి సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించుకోవడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతే దేవాలయాలు అభివృద్ధి చెందాయి. గోదావరి, కృష్ణా పుష్కరాలు నిర్వహించి భక్తి పారవశ్యాన్ని పెంపొందించినట్లు తెలిపారు. మేడారంలో సమ్మక్క, సారక్క జాతరలో నాలుగు రోజులపాటు అక్కడే ఉండి దేశంలో తెలంగాణ కీర్తి పెరిగేలా ఉత్సవాలు నిర్వహించామన్నారు. సుమారు 1.30కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారన్నారు. దేవాలయ భూములను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేవాదాయ శాఖ గుర్తింపు పొంది అభివృద్ధికి నోచుకోని పురాతన ఆలయాల అభివృద్ధిపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను సాగుకోసం మళ్లించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రాజుల కాలంలోనూ సాధ్యంకాని కృష్ణ శిలలతో రూ.1200 కోట్ల వ్యయంతో సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారన్నారు. మార్చి 28 నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మూలవిరాట్ విగ్రహ దర్శన భాగ్యం భక్తులకు కల్పించనున్నట్లు తెలిపారు.
ఆలయాల అభివృద్ధికి సహకరించాలి..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దేవాదాయశాఖ ద్వారా గుర్తింపు పొందిన అతి పురాతన ఆలయాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరారు. 14 పురాతన ఆలయాలు ఎత్తైన గుట్టలపై ఉన్నాయని, వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్నారు. నల్లవెల్లి, యాచారం, నందివనపర్తి, ఇంజపూర్, తుర్కయాంజాల్, ఎలిమినేడు గ్రామాల్లోని పురాతర ఆలయాలను అభివృద్ధి చేయాలన్నారు. నజ్దిక్‌సింగారం ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయశాఖ మంత్రి రూ.17లక్షలు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. నజ్దిక్‌సింగారంలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణాలకు రూ.60లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. సీపీఎం నేతలు మధుసూదన్‌రెడ్డి, బ్రహ్మయ్యలు ఓంకారేశ్వరాలయ భూములను రైతులకు కౌలుకు ఇవ్వాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, సర్పంచ్ అరుణమ్మ, ఎంపీటీసీ రవికిరణ్‌రెడ్డి, ఉపసర్పంచ్ వరప్రసాద్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, డైరెక్టర్లు స్వరూప, శశికళ, టీఆర్ఎస్ నాయకులు చిన్నోళ్ల యాదయ్య, బిలకంటి శేఖర్‌రెడ్డి, పాండురంగారెడ్డి, జోగిరెడ్డి, తలారి మల్లేశ్, ఖాజు, మారోజు శ్రీనివాస్, పురోహితులు అరవింద్‌శర్మ, రాజు శర్మ పాల్గొన్నారు.