పరిగి, సెప్టెంబర్ 6 : రాష్ట్ర రాజధాని చుట్టూ ఉన్న పరిశ్రమలను పరిగి నియోజకవర్గంలోని రాకంచర్ల పారిశ్రామికవాడకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరిశ్రమల తరలింపుతో ఈ ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. రాబోయే కొద్ది నెలల్లోనే రాకంచర్ల పారిశ్రామికవాడకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరానున్నాయి. ఇందుకు సంబంధించి టీఎస్ఐఐసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో ఇప్పటికే కొన్ని పరిశ్రమలు నెలకొల్పగా, మరికొన్నింటినీ సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాంతానికి తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు.
112.48 ఎకరాల్లో పారిశ్రామికవాడ…
పూడూరు మండలం రాకంచర్ల సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని 112.48 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్థలాన్ని టీఎస్ఐఐసీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. ప్రత్యేకంగా రోడ్లు వేయించి, మొక్కలు నాటారు. నీటి సరఫరాకు మిషన్ భగీరథ ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం చేపట్టారు. ఈ స్థలంలో మొత్తం 42 ప్లాట్స్ చేశారు. వాటిలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 6 ప్లాట్లను వివిధ పరిశ్రమలకు కేటాయించారు. ఇప్పటికే జిపిల్ పరిశ్రమ నెలకొల్పారు. ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి సిమెంట్ పరిశ్రమల్లో ఫార్మేస్లో కాల్చడానికి అవసరమైన బ్రిక్స్ తయారు చేస్తున్నారు. మరోవైపు ఎంఎం కాపర్వైర్స్ పరిశ్రమ కొనసాగుతున్నది. విద్యుత్ సరఫరాకు సబ్‌స్టేషన్ నిర్మించేందుకు స్థలం కేటాయించారు.
ఆరు నెలల్లో పరిశ్రమల తరలింపు..
కాటేదాన్ ప్రాంతంలో ఉన్న ఐరన్ ఓర్, స్టీల్ ప్రొడక్ట్స్ పరిశ్రమలను రాకంచర్ల పారిశ్రామికవాడకు తరలించేందుకు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిలతో కలిసి రాకంచర్ల పారిశ్రామికవాడ స్థలాన్ని సందర్శించారు. కాటేదాన్‌లో ఉన్న 20 ఐరన్ ఓర్, స్టీల్ పరిశ్రమలను రాకంచర్లకు తరలిస్తామని ప్రకటించారు. ఇప్పటికే సంబంధిత పరిశ్రమలకు నోటీసులు జారీ చేశారు. ఆరు నెలల్లో పరిశ్రమలను తరలించేలా చర్యలు చేపడుతామన్నారు. పరిశ్రమలను తరలించకుంటే కాటేదాన్ పరిశ్రమ రద్దుతోపాటు రాకంచర్ల ఇండస్ట్రియల్ పార్కులో కేటాయించిన భూమిని సైతం రద్దు చేస్తామని వెల్లడించారు. స్టీల్ పరిశ్రమలు ఏర్పాటు చేయనిచో జనరల్ పార్కుగా మారుస్తూ అన్ని పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామని టీఎస్ఐఐసీ చైర్మన్ ప్రకటించారు. రాకంచర్ల పారిశ్రామికవాడ జాతీయ రహదారికి ఆనుకొని ఉంటుంది. తద్వారా ఆయా పరిశ్రమలలో ఉత్పత్తులకు అవసరమైన ముడి సరుకులు, ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు.
యువతకు ఉపాధి అవకాశాలు..
రాకంచర్ల పారిశ్రామికవాడలో పరిశ్రమల ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇందుకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. టీఎస్ఐపాస్తో రాష్ర్టానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. పారిశ్రామికవాడ అభివృద్ధితో ఇతర రంగాలు అభివృద్ధి చెందనున్నాయి.
పరిశ్రమలతో మరింత అభివృద్ధి..
రాకంచర్ల పారిశ్రామికవాడలో పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. జనరల్ పరిశ్రమలు సైతం ఈ స్థలంలో ఏర్పాటు కానున్నాయి. తద్వారా పరిగి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
పరిశ్రమల తరలింపునకు చర్యలు..
పూడూరు మండలం రాకంచర్లలోని ఇండస్ట్రియల్ పార్కుకు హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోని స్టీల్ రీ రోలింగ్ ఇండస్ట్రీస్ తరలించేందుకు టీఎస్ఐఐసీ చర్యలు చేపట్టింది. కొన్ని పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చాం.