చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ
తుర్కయాంజాల్, ఫిబ్రవరి 18 : వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం హెచ్ఎండబ్ల్యూఏఎస్ఎస్బీ అధికారులతో చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ శుక్రవారం తొర్రూర్ వార్డు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి వార్డుల్లోని తాగునీటి సమస్య పై చర్చించారు. ఏయే వార్డుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉందో గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరి, తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు సూచించారు. అవసరమైన కాలనీల్లో వెంటనే వాటర్ పైపులైన్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. వేసవి కాలంలో ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. స్థానిక వార్డు కౌన్సిలర్లతో సమన్వయం చేసుకొని నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత, కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి, కౌన్సిలర్లు కంబాలపల్లి ధన్రాజ్, బండారు బాల్రాజ్, హెచ్ఎండబ్ల్యూఎస్ జీఎం శ్రీధర్, డీజీఎం సునిల్, ఏఈ వినయ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాగన్నగూడ ప్రభుత్వ పాఠశాల సందర్శన
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చైర్పర్సన్ అనురాధ, వైస్ చైర్పర్సన్ హరిత, కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి, కౌన్సిలర్లు రాగన్నగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మున్సిపాలిటీలో మొత్తం 9 ప్రభు త్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అరకొరగా ఉన్నట్లు తా ము గుర్తించామన్నారు. గుర్తించిన పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, అదనపు తరగతి గదులు, ప్రహ రీ నిర్మాణం వంటి సమస్యల పై ఎస్టిమేషన్ తయారు చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.