మంచాల నవంబర్ 19 : ఆరుట్ల గ్రామ సమీపంలోని బుగ్గరామలింగేశ్వర స్వామి జాతరలో శివనామస్మరణతో మార్మోగింది. కార్తిక మాసం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు జాతర జరుగనున్నది. తొలిరోజు శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల మొదటి రోజు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేను సర్పంచ్ కొంగరవిష్ణువర్ధన్రెడ్డి స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆరుట్ల పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లు చేశారు. బుగ్గరామలింగేశ్వర సన్నిదానంలో పుణ్య స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయనే నమ్మకంతో భక్తుల నమ్మకం. జాతరలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. జాతర వద్ద వైద్యారోగ్య శాఖా ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంచారు.
ఎంతో విశిష్టత ఉంది:ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
బుగ్గరామలింగేశ్వర స్వామికి ఎంతో విశిష్టత ఉన్నది. ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకుంటానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. చిన్న గుడిగా ఉన్న బుగ్గ ఆలయం ఎంతో అభివృద్ధి చేయడంలో తనతో పాటు భక్తులు ముందుకు వచ్చారన్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఎంపీపీ నర్మద, ఎంపీటీసీ రమేశ్, ఉపసర్పంచ్ జంగయ్య గౌడ్, టీఆర్ఎస్ నాయకులు వెంకటరమణారెడ్డి, జగదీశ్, రాము, జానీపాషా పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలంతో పాటు ఆదిబట్ల మున్సిపాలిటీలో కార్తిక పౌర్ణమి వేడుకలు శనివారం భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని దండుమైలారం, రాయపోల్, ముకునూరు, కప్పాడు, చర్లపటేల్గూడ, తుర్కగూడ, ఎలిమినేడు గ్రామాలతో పాటు ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్, రాందాస్పల్లి, మంగల్పల్లిపటేల్గూడతో పాటు ఆయా గ్రామాల్లో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు గంగాహారతి..
ఇబ్రహీంపట్నం అఖండ ట్రస్టు ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హారతి కార్యక్రమంలో ప్రజలు పాల్గొని ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు హారతి ఇచ్చారు. అనంతరం ఇబ్రహీంపట్నం నుంచి రాచకొండలోని ప్రసిద్ధి చెందిన శివాలయం వరకు ర్యాలీగా వెళ్లి జ్యోతిని వెలిగించారు.